పచ్చిరొట్ట విత్తన ధరలు ఖరారు | - | Sakshi
Sakshi News home page

పచ్చిరొట్ట విత్తన ధరలు ఖరారు

Published Sat, Apr 5 2025 2:11 AM | Last Updated on Sat, Apr 5 2025 2:11 AM

పచ్చిరొట్ట విత్తన ధరలు ఖరారు

పచ్చిరొట్ట విత్తన ధరలు ఖరారు

కొరిటెపాడు(గుంటూరు): పచ్చిరొట్ట విత్తన ధరలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖరీఫ్‌లో రాయితీ విత్తన పంపిణీ ప్రక్రియలో భాగంగా ఏటా రైతులకు ఉపయోగపడే పచ్చిరొట్ట విత్తనాలు అందిస్తున్న విషయం తెలిసిందే. పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర పొలాల్లో చల్లి పూతకు వచ్చిన తర్వాత కలియదున్నితే సేంద్రీయ పదార్థం బాగా పెరుగుతుందని శాసీ్త్రయంగా నిరూపితమైంది. దీంతో ఇటీవల ఈ విత్తనాలకు రైతుల నుంచి డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా ప్రభుత్వం రాయితీపై వీటిని అందిస్తోంది. తాజాగా రాయితీ ధరలను ఖరారు చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా(గుంటూరు, పల్నాడు, బాపట్ల)కు ఈ ఏడాది 9,536 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు కేటాయించారు. అందులో గుంటూరు జిల్లాకు 301 క్వింటాళ్ల జీలుగ, 436 క్వింటాళ్లు జనుము, 967 క్వింటాళ్లు పిల్లిపెసర కలిపి మొత్తం 1,704 క్వింటాళ్లు కేటాయించారు. పల్నాడు జిల్లాకు 2,607 క్వింటాళ్లు జీలుగ, 1,559 క్వింటాళ్లు జనుము, 1,178 క్వింటాళ్లు పిల్లిపెసర కలిపి మొత్తం 5,544 క్వింటాళ్లు కేటాయించారు. అలాగే బాపట్ల జిల్లాకు 856 క్వింటాళ్లు జీలుగ, 853 క్వింటాళ్లు జనుము, 779 క్వింటాళ్లు పిల్లిపెసర కలిపి మొత్తం 2,488 క్విటాళ్లు కేటాయించారు. వీటిని 50 శాతం రాయితీతో రైతులకు ఇవ్వనున్నారు. ఏపీ సీడ్స్‌ ద్వారా వీటిని సరఫరా చేసి రైతులకు పంపిణీ చేయనున్నారు.

గరిష్టంగా ఐదు బ్యాగులు

జీలుగ విత్తనాలు క్వింటా పూర్తి ధర రూ.12,300 కాగా, 50 శాతం రాయితీతో రూ.6,150 చొప్పున రైతులకు అందజేయనున్నారు. అలాగే క్వింటా జనుము విత్తనాల పూర్తి ధర రూ.10,900 కాగా, 50 శాతం రాయితీ పోనూ రూ.5,450 చెల్లించాలి. పిల్లిపెసర క్వింటా పూర్తి ధర రూ.18 వేలు కాగా, 50 శాతం రాయితీ పోనూ రూ.9 వేలు చొప్పున రైతులకు విక్రయిస్తారు. జీలుగ, జనుము విత్తనాలు 10 కిలోల ప్యాకెట్ల రూపంలో, పిల్లిపెసర 8 కిలోల ప్యాకెట్‌ కింద ఎకరాలోపు రైతులకు ఒక బ్యాగ్‌, రెండు ఎకరాలకు రెండు బ్యాగులు, మూడు ఎకరాలకు మూడు బ్యాగ్‌లు, నాలుగు ఎకరాలున్న రైతులకు నాలుగు బ్యాగ్‌లు, ఐదు ఎకరాలు, అంత కన్నా ఎక్కువ ఉన్న వారికి గరిష్టంగా ఐదు బ్యాగుల పంపిణీ చేయనున్నారు. రైతు ఆసక్తిని బట్టి మూడు రకాల విత్తనాలు వేర్వేరుగానూ, మూడు రకాల విత్తనాలు కలిపి ఒకే బ్యాగ్‌ రూపంలోనూ ఇవ్వనున్నారు. మూడు కలిపిన వాటిలో నాలుగు కిలోల చొప్పున జీలుగ, జనుము, రెండు కిలోల పిల్లిపెసర ఉంటాయి. 10 కిలోలు కలిగిన మిక్సింగ్‌ కిట్‌ పూర్తి ధర రూ.1,296 కాగా, 50 శాతం రాయితీ పోనూ రూ.648లు చొప్పున రైతులు చెల్లించాల్సి ఉంటుంది. పచ్చిరొట్ట విత్తనాలు అవసరమైన రైతులు రైతు సేవా కేంద్రాల(ఆర్‌ఎస్‌కే)లో తమ వాటా చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని ఏపీ సీడ్స్‌ ఉమ్మడి గుంటూరు జిల్లా మేనేజర్‌ పి.సుమలత శుక్రవారం ‘సాక్షి’కి వివరించారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాకు 9,536 క్వింటాళ్ల కేటాయింపు 50 శాతం రాయితీతో రైతులకు జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement