ప్రభుత్వ ఆమోదానికి జెడ్పీ బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆమోదానికి జెడ్పీ బడ్జెట్‌

Apr 8 2025 7:35 AM | Updated on Apr 8 2025 7:35 AM

ప్రభు

ప్రభుత్వ ఆమోదానికి జెడ్పీ బడ్జెట్‌

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ ఆమోదం సాధ్యం కాలేదు. వరుసగా రెండుసార్లు వాయిదా పడిన సర్వసభ్య సమావేశంలో బడ్జెట్‌ ఆమోదం పొందలేకపోయిన దృష్ట్యా పంచాతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 199 సబ్‌ రూల్‌ 3 కింద బడ్జెట్‌ను ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపినట్లు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు సోమవారం చెప్పారు.

పార్టీ ఫిరాయించిన చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా..

జెడ్పీ ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఆమోదించేందుకు చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా గత నెల 15న ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా పడింది. వైఎస్సార్‌ సీపీ నుంచి జెడ్పీటీసీగా గెలిచిన హెనీ క్రిస్టినా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాంచడంతో పాలకవర్గంలో సింహభాగమైన వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీలు ఆమె తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కీలకమైన బడ్జెట్‌ ఆమోదం కోసం రెండు వారాల వ్యవధిలో గత నెల 29న రెండోసారి సమావేశాన్ని ఏర్పాటు చేసినా, అదే రోజు టీడీపీ ఆవిర్భావ దినోత్సవమని, బడ్జెట్‌ ఆమోదానికి కావాల్సిన సంఖ్యలో టీడీపీ ప్రజా ప్రతినిధులు హాజరు కావడం లేదనే సమాచారంతో రెండు రోజుల ముందుగా సమావేశాన్ని వాయిదా వేశారు. చైర్‌పర్సన్‌ హోదాలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులకు జెడ్పీటీసీల అనుమతి లేకుండా, వారికి కనీస సమాచారమివ్వకుండా ఏకపక్షంగా పనులను మంజూరు చేస్తున్న విషయమై గతేడాది కాలంగా జెడ్పీటీసీలు ప్రతి సర్వసభ్య సమావేశంలోనూ గళం విప్పుతున్నారు. జెడ్పీ పాలకవర్గంలో భాగస్వాములైన జెడ్పీటీసీలను పక్కనపెట్టి అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులకు ప్రాధాన్యమిస్తూ, వారు చెప్పిన పనులకు జీ హుజూర్‌ అనడంపై జెడ్పీటీసీలు తీవ్ర అగ్రహంతో ఉన్నారు. ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో జెడ్పీటీసీలకు తెలియకుండా, సమావేశంలో ఆమోదింపచేయకుండా రూ.12 కోట్ల అభివృద్ధి పనులకు ఏకపక్షంగా అనుమతులు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, జెడ్పీటీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి సమావేశానికి గైర్హాజరయ్యారు.

ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఆమోదించుకోలేని దుస్థితి వరుసగా రెండుసార్లు వాయిదా పడిన సర్వసభ్య సమావేశం ఏకపక్ష పనులు అనుమతులపై తీవ్ర అభ్యంతరం పార్టీ ఫిరాయించిన చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చిన జెడ్పీటీసీలు బడ్జెట్‌ ఆమోదం తమ వల్ల కాదంటూప్రభుత్వానికి నివేదన గత ఏడాది మార్చి 31 నాటికే ఆమోదించుకోవాల్సిన బడ్జెట్‌ పంచాయతీరాజ్‌ చట్టాన్ని అనుసరించి ప్రభుత్వానికి పంపిన సీఈవో

బడ్జెట్‌ ఆమోదం తమ వల్లకాదంటూ ప్రభుత్వానికి నివేదన

చైర్‌పర్సన్‌ తన అస్తిత్వాన్ని కోల్పోయినట్లే

జెడ్పీ బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపడం చైర్‌పర్సన్‌ తన అస్తిత్వాన్ని కోల్పోయినట్లుగా భావించాలి. జెడ్పీ చరిత్రలోనే కోరం కాక వాయిదా పడటం తొలిసారి. గతనెల 29న జరగాల్సిన సమావేశాన్ని 50 శాతం సభ్యులు వాయిదా వేయాలని కోరినట్లుగా జెడ్పీటీసీలకు లేఖలు పంపారు. 50 శాతం మంది వాయిదా కోరి ఉంటే, మూడింట ఒక వంతు సభ్యులతో కోరం ఏర్పాటు చేసి, గత నెల 29నే సమావేశాన్ని ఎందుకు జరపలేకపోయారో ప్రజలకు చెప్పాలి. బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపడం జెడ్పీ ప్రతిష్టను దిగజార్చడంతో పాటు పాలకమండలి సభ్యులను, జిల్లా ప్రజలను అవమానించడమే. పార్టీ ఫిరాయించిన చైర్‌పర్సన్‌ తక్షణమే రాజీనామా చేయాలి.

– పిల్లి ఓబుల్‌రెడ్డి, రొంపిచర్ల జెడ్పీటీసీ

బడ్జెట్‌ సమావేశం వరుసగా రెండుసార్లు వాయిదా పడటంతో ఇక ఆమోదింపచేసుకోవడం తమ వల్ల కాదంటూ ప్రభుత్వానికి నివేదించడం జెడ్పీ పరిపాలన తీరు, తెన్నులకు అద్దం పడుతోంది. గత ఏడాది మార్చి 31 నాటికే ఆమోదించుకోవాల్సిన బడ్జెట్‌ చివరికి ప్రభుత్వ ఆమోదం కోసం వెళ్లింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.643 కోట్ల ఆదాయంతో రూపొందించిన ఆంచనా బడ్జెట్‌లో రూ.640 కోట్లు వ్యయం చూపారు. అదే విధంగా పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌, గ్రామీణ నీటి సరఫరా విభాగాలను మినహాయిస్తే జెడ్పీ బడ్జెట్‌ రూ.71.11 కోట్ల ఆదాయం, రూ.69.10 కోట్ల మిగులుగా చూపారు.

ప్రభుత్వ ఆమోదానికి జెడ్పీ బడ్జెట్‌ 1
1/1

ప్రభుత్వ ఆమోదానికి జెడ్పీ బడ్జెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement