
విద్యుత్ విజిలెన్స్ అధికారుల దాడులు
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు డీ–5 సెక్షన్, ఆర్టీసీ బస్టాండ్, పాత గుంటూరు, బాలాజీ నగర్, సుద్దపల్లి డొంక, ప్రగతినగర్‌లలో విద్యుత్ శాఖ విజిలెన్స్, ఆపరేషన్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్ వెంకటేశ్వరరావు, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టి.శ్రీనివాసబాబు ఆధ్వర్యంలో 59 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు, శ్రీనివాసబాబు మాట్లాడుతూ తక్కువ లోడ్‌కు సర్వీసు తీసుకొని అదనపు లోడు వాడుతున్న 140 సర్వీస్‌ల కింద రూ.4.83 లక్షలు, మీటరు ఉన్నప్పటికీ అక్రమంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఐదుగురికి రూ.2.19 లక్షలు, అనుమతించిన కేటగిరి కాక ఇతర కేటగిరిలో విద్యుత్ వాడుకుంటున్న ఇద్దరికి రూ.లక్ష, అసలైన వాడకం కంటే బిల్లు తక్కువగా ఇవ్వబడిన రెండు సర్వీసులు గుర్తించి రూ.50 వేలు మొత్తం రూ.8.52 లక్షలు అపరాధ రుసుము విధించినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్‌ను వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గృహావసరాలకు, వాణిజ్య సముదాయాలకు విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుని, విద్యుత్ మీటర్లు తిరగకుండా చేస్తే అటువంటి వాటిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్ చౌర్యంపై ఫిర్యాదులకు 9440812263, 9440812360, 9440812361 నంబర్లకు నేరుగా లేదా వాట్సప్ ద్వారా సంప్రదించవచ్చు అని వారు వెల్లడించారు. దాడుల్లో డీఈఈలు కె.రవికుమార్, ఎన్.మల్లిఖార్జున ప్రసాద్, పీహెచ్ హుస్సేన్‌ఖాన్, ఏఈలు కె.కోటేశ్వరరావు, ఎ.చంద్రశేఖర్, ఎం.సతీష్‌కుమార్, యు.శివశంకర్, షేక్ మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు.
రూ.8.52 లక్షలు అపరాధ రుసుం వసూలు