
పెదపలకలూరు శ్రీచైతన్య స్కూల్ విద్యార్థుల ప్రతిభ
గుంటూరు రూరల్: పదో తరగతి ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారని పెదపలకలూరు శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్ డైరెక్టర్‌లు తెలిపారు. బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో కేవీ సౌజన్య అత్యధికంగా 586 మార్కులు సాధించి రాష్ట్ర ర్యాంకును సాధించిందన్నారు. పాఠశాలలో 550 మార్కులకుపైగా సాధించిన విద్యార్థులు 9 మంది, 500 మార్కులకు పైగా సాధించిన వారు 28 మంది ఉన్నారన్నారు. నూరుశాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి పేరు తెచ్చారన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్‌లు శనగల సాంబిరెడ్డి, ఎం.వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఏరువ శ్రీవేణి, గ్రామస్తులు అభినందించారు.
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
ఫిరంగిపురం: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత కానందుకు మనస్తాపానికి గురై విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పి.వినయకుమార్ (16) స్థానికంగా ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదు. మనస్తాపానికి గురై తన తాత పాపయ్య ఇంటికి వచ్చి ఫ్యాన్‌కు ఉరి వేసుకొన్నాడు. చుట్టు పక్కల వారు గమనించి విద్యార్థిని స్థానికంగా ఉన్న ప్రయివేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
విద్యార్థిని రక్షించిన పోలీసులు
తాడేపల్లి రూరల్ : 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేస్తుండగా బుధవారం తాడేపల్లి పోలీసులు కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. సీఐ కల్యాణ్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన ఓ విద్యార్థికి 10 తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెంది తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుండి వచ్చాడన్నారు. తల్లిదండ్రులు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అక్కడి సీఐ అప్రమత్తమై విద్యార్థి వద్ద సెల్‌ఫోన్ ఆధారంగా లొకేషన్ కనిపెట్టి తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. నాలుగు బృందాలుగా తాడేపల్లి పోలీసులు వెతకగా తాడేపల్లి కృష్ణాకెనాల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు పంపినట్లు సీఐ కల్యాణ్ రాజు తెలిపారు.
హైదరాబాద్‌కు ఇంద్ర బస్సులు
చిలకలూరిపేటటౌన్: చిలకలూరిపేట డిపో నుంచి హైదరాబాదు – బీహెచ్‌ఈఎల్ ఏసీ బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు డీఎం ఎస్.రాంబాబు బుధవారం తెలిపారు. డిపో వినియోగదారుల అవసరాలు పరిశీలించి హైదరాబాద్, బీహెచ్‌ఈఎల్ మార్గాల్లో కొత్తగా రిజర్వేషన్‌ను ప్రారంభించామన్నారు.

పెదపలకలూరు శ్రీచైతన్య స్కూల్ విద్యార్థుల ప్రతిభ