
సర్వీస్ బ్లాక్ నిర్మాణానికి ప్రభుత్వంతో ఒప్పందం
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో సర్వీస్ బ్లాక్ నిర్మాణానికి గురువారం ఒప్పందం జరిగింది. డీఎంఈ డాక్టర్ నరసింహం భవన నిర్మాణ దాత ప్రముఖ పారిశ్రామిక వేత్త తులసి రామచంద్రప్రభు తనయుడు తులసి యోగీష్ చంద్రతో ఒప్పందం చేసుకున్నారు. విజయవాడ డీఎంఈ కార్యాలయంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు రూ. పది కోట్ల వ్యయంతో సర్వీస్ బ్లాక్ నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు ముందుకు వచ్చారు.
జనవరిలో జీవో విడుదల
సర్వీస్ బ్లాక్ నిర్మాణం పూర్తి చేసేందుకు తులసి రామచంద్ర ప్రభుకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జనవరిలో జీవో నెంబర్ 11 ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి అన్ని అనుమతులు పూర్తి చేసుకొని గురువారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ డి ఎస్ వి ఎల్ నరసింహం, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, తులసి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ యోగీష్ చంద్ర విజయవాడ డీఎంఈ కార్యాలయంలో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. సర్వీస్ బ్లాకు నిర్మాణ కార్యక్రమాలు వెంటనే మొదలు పెడతామని యోగీష్ చంద్ర తెలిపారు. భవన నిర్మాణం 18 నెలల్లోగా పూర్తి చేసి అందిస్తామన్నారు. ఈసందర్భంగా యోగీష్ చంద్రను డీఎంఈ డాక్టర్ నరసింహం, డాక్టర్ యశశ్వి రమణ సన్మానించారు. కార్యక్రమంలో గుంటూరు జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ కుమార్, వివేక్ పాల్గొన్నారు.