వదిలెళ్లిపోయావా బిడ్డా...
రైలు కింద పడి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
వంగాలపల్లి రైల్వేగేటు వద్ద ఘటన
మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు
పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ
స్టేషన్‌ఘన్‌పూర్/చిల్పూరు: బాగా చదువుకుని మమ్మల్ని ఉద్దరిస్తావనుకుంటే వదిలెళ్లిపోయావా అంటూ శుక్రవారం వంగాలపల్లి రైల్వేగేట్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామానికి చెందిన కొడారి రాజు, రమ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు కొడారి రాజ్‌కుమార్(15) స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని శివునిపల్లి సెయింట్‌థామస్ హైస్కూల్ హాస్టల్‌లో ఉంటూ 10వ తరగతి చదువుతున్నాడు. అతడి తమ్ముడు కూడా అదేపాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. కాగా శుక్రవారం ఉదయం హాస్టల్‌లో విద్యార్థి కనిపించలేదు.
దాంతో పాఠశాల ప్రిన్సిపాల్.. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో విద్యార్ధి రాజ్‌కుమార్ వంగాలపల్లి రైల్వేగేటు సమీపాన విగతజీవిగా పడి ఉన్నట్లు మధ్యాహ్నం సమయంలో తెలిసింది. అయితే సెయింట్‌థామస్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే రాజ్‌కుమార్ మృతిచెందాడని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. రూ.లక్షల్లో ఫీజులు తీసుకునే పాఠశాల హాస్టల్‌కు కనీసం వాచ్‌మన్ లేకపోవడం ఏంటని మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం బయటి వ్యక్తులు రాజ్‌కుమార్‌పై పాఠశాలలో దాడి చేశారని, బయటి వ్యక్తులు పాఠశాలలో విద్యార్థిపై దాడి చేస్తే మాకు చెప్పరా.. అని ప్రశ్నించారు.
విద్యార్థి నాలుగు రోజులుగా మూడీగా ఉంటున్నట్లు తెలిసిందని, సమాచారం ఇవ్వలేదన్నారు. రాజ్‌కుమార్‌కు ఆత్మహత్య చేసుకోవాల్సిన గత్యంతరం లేదని వాపోయారు. విద్యార్థి మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాగా, విద్యార్థి ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. అప్పటికే పాఠశాల వద్దకు మృతిచెందిన విద్యార్థి రాజ్‌కుమార్ బంధువులు, ఉప్పుగల్లు గ్రామస్థులు అధిక సంఖ్యలో చేరుకుని పాఠశాల ఎదుట ఆందోళన చేశారు.
ఇదిలా ఉండగా.. విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో సెయింట్‌థామస్ స్కూల్ వద్ద శుక్రవారం స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీమ్‌శర్మ, సీఐ వేణు.. ఎస్సైలు, ఏఎస్సై, పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. అయితే విద్యార్థి రాజ్‌కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని వారి బంధువులు పాఠశాల యాజమాన్యంతో రాత్రి వరకు చర్చలు జరిపారు. కాగా, ఉప్పుగల్లు గ్రామానికి చెందిన కొడారి లోకేశ్ అనే డిగ్రీ విద్యార్థి సైతం వంగాపల్లి రైల్వేగేటు సమీపంలో 13 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్న రాజ్‌కుమార్‌కు లోకేశ్ వరుసకు బాబాయి.
ఉదయమే గుర్తించాం..
విద్యార్థి పాఠశాల నుంచి పారిపోయినట్లు శుక్రవారం ఉదయం గుర్తించాం. రోజూ మాదిరిగానే ఉదయం టిఫిన్ సమయానికి ముందు హాజరు తీసుకుంటాం. ఉదయం రాజ్‌కుమార్ లేకపోవడంతో ఇతర విద్యార్థులను విచారించి పాఠశాల నుంచి పారిపోయినట్లు గుర్తించాం. పేరెంట్స్‌కు సమాచారం అందించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. విద్యార్థి మృతిచెందడం చాలా బాధాకరం.
– పాఠశాల ప్రిన్సిపాల్ కేసీ జాన్‌బన్నీ
Comments
Please login to add a commentAdd a comment