
పుష్కరాలకు జాయ్‌రైడ్స్
కాళేశ్వరం : జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీవరకు జరిగే సరస్వతి నది పుష్కరాలను హెలికాప్టర్ల ద్వారా భక్తులు వీక్షించేందుకు టిక్కెట్ తీసుకొని ఏవియేషన్ శాఖ ప్రభుత్వం జాయ్‌రైడ్స్ ఏర్పాటు చేసింది. కానీ పుష్కరాలకు రోజులు దగ్గర పడుతుండడంతో జాయ్‌రైడ్స్‌పై సందిగ్ధత ఏర్పడినట్లు తెలిసింది. పుష్కరాలకు ప్రభుత్వం రూ.25కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. అధికారులు కూడా హెలికాప్టర్లు తిరగడంపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. కాగా, కాళేశ్వరం నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి గ్రామ శివారు వద్ద కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీపంపుహౌజ్‌కు సంబంధించిన మూడు హెలిపాడ్లు శాశ్వతంగా నిర్మాణం చేసి ఉన్నాయి. భక్తులు 12 రోజుల పాటు ఈ మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి హెలికాప్టర్ సేవలు వినియోగించుకుంటారా! లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాళేశ్వరం సమీపంలోనే హెలిపాడ్లు సిద్ధం చేస్తే జాయ్‌రైడ్స్‌కు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది.
గోదావరి పొడవునా..
ఈ జాయ్‌రైడ్స్‌తో హెలికాప్టర్‌తో 10–15 నిమిషాలతో అన్నారం బరాజ్ టు మేడిగడ్డ బరాజ్ వరకు గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతి నది పొడవునా విహాంగ వీక్షణం చేయడానికి వీలు కల్పిస్తారు. ఇదే విషయంపై కాళేశ్వరం దేవస్థానం ఈఓ శనిగెల మహేష్‌ను సంప్రదించగా.. మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవతో ఏవియేషన్ శాఖ ద్వారా జాయ్‌రైడ్స్ కోసం ఏర్పాట్లు జరుగుతుందని, మూడు హెలిపాడ్లు కన్నెపల్లి వద్ద సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో సిద్ధంగా మూడు హెలిపాడ్లు
అన్నారం టు మేడిగడ్డకు విహాంగ వీక్షణం

పుష్కరాలకు జాయ్‌రైడ్స్