
మే 2న ‘ఇందిరమ్మ’ అర్హుల జాబితా
హన్మకొండ: ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికకు ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేసి మే 2న అర్హుల జాబితా ప్రదర్శించాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హుల ఎంపిక కోసం నియమితులైన మండల స్థాయి వెరిఫికేషన్ ఆఫీసర్లకు సోమవారం కలెక్టరేట్‌లో శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ప్రతీ మండలంలో నలుగురు అధికారులను వెరిఫికేషన్ ఆఫీసర్లుగా నియమించినట్లు తెలిపారు. మహిళలను మాత్రమే అర్హులుగా ఎంపిక చేయాలని సూచించారు. వారి వివరాలను నమోదు చేయాలన్నారు. ఏమైనా సందేహాలుంటే ఎంపీడీఓ, హౌసింగ్ పీడీలను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వెరిఫికేషన్ అధికారులకు పంచాయతీ కార్యదర్శుల సహకారం అందిస్తున్నట్లుగానే అర్బన్ ప్రాంతంలో వార్డు ఆఫీసర్లు తోడ్పాటు అందించాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి రవీందర్, కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ గొడిశాల రవీందర్, పరకాల ఆర్డీఓ నారాయణ, గృహ నిర్మాణ సంస్థ డీఈ సిద్ధార్థనాయక్, ఎంపీడీఓలు, డిప్యూటీ తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.
గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలి..
జిల్లాలోని ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో సరిపడా గన్నీ బ్యాగులు, టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో సంబంధిత జిల్లా అధికారులతో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో తగినన్ని టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు మేన శ్రీను, రవీందర్ సింగ్, సంజీవరెడ్డి, కొమరయ్య, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
30వ తేదీ వరకు
వెరిఫికేషన్ పూర్తి చేయాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య