ఎముక మీద ఏదైనా అసాధారణ లేదా అవాంఛిత కణజాలం పెరుగుదలతో కనిపించే ‘ఎముక ట్యూమర్’లను ఎముక క్యాన్సర్‌గా చెప్పవచ్చు. ఇలాంటి ఎముక గడ్డలు శరీరంలోని ఏ ఎముకపైన అయినా రావచ్చు. అంటే ఎముక పైభాగంలో లేదా లోపలి వైపునా ఇంకా చెప్పాలంటే ఎముకలోని మూలుగ (బోన్ మ్యారో)లో... ఇలా ఎక్కడైనా రావచ్చు. ఈ బోన్ క్యాన్సర్ గురించి సాధారణ ప్రజలకూ అవగాహన కలిగేలా యూకే బర్మింగ్‌హమ్‌లోని రాయల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్‌కు చెందిన మస్క్యులో స్కెలిటల్ రేడియాలజీ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. రాజేశ్, అలాగే అక్కడి వైద్యురాలు డాక్టర్ సుష్మితా జగదీశ్ చెబుతున్న కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.
ఎముక క్యాన్సర్‌లో రకాలివి...
ఎముకల గడ్డల గురించి... ఎముక మీద వచ్చే ఈ గడ్డ (బోన్ ట్యూమర్) అన్నది ప్రమాదాన్ని తెచ్చిపెట్టే (మేలిగ్నెంట్) బోన్ క్యాన్సర్ గడ్డ కావచ్చు లేదా అది ఎలాంటి ప్రమాదాన్నీ కలిగించని (బినైన్) గడ్డ కూడా కావచ్చు.
ఇక ఎముక క్యాన్సర్ గురించి చెప్పాలంటే వచ్చే విధానాన్ని బట్టి వీటిని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకవేళ క్యాన్సర్ గనక ఎముకలోనే మొదలైతే దాన్ని ‘ప్రైమరీ బోన్ క్యాన్సర్’ అంటారు.
ఒకవేళ ఈ క్యాన్సర్ దేహంలోని మరో చోట మొదలై... ఆ కణాలు ఎముక మీదికి చేరి ఎముక కణాలనూ క్యాన్సర్ కణాలుగా మార్చడం వల్ల వచ్చిన క్యాన్సరైతే దాన్ని ‘మెటాస్టాటిక్ బోన్ డిసీజ్’ అనీ ‘సెకండరీ బోన్ క్యాన్సర్’ అని డాక్టర్లు చెబుతారు.
ప్రైమరీ బోన్ క్యాన్సర్లలో...
⇒ మల్టిపుల్ మైలోమా (మూలుగలో వచ్చే క్యాన్సర్)
⇒ ఆస్టియోసార్కోమా (ఇది టీనేజీ పిల్లల ఎముకల్లో కనిపించే సాధారణమైన క్యాన్సర్... సాధారణంగా మోకాలి చుట్టూ ఇది అభివృద్ధి చెందుతుంది)
⇒ ఈవింగ్స్ సార్కోమా (ఇది కూడా యువతలో ఎక్కువగా కనిపిస్తూ సాధారణంగా కాళ్లూ, కటి భాగాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది) ∙కాండ్రో సార్కోమా (ఇది ఎముకల్లో కనిపించే అతి సాధారణ క్యాన్సర్లలో రెండో ది, ఎక్కువగా మధ్య వయస్కుల్లో అందునా చాలావరకు కటి లేదా భుజం ఎముకల్లో కనిపిస్తుంది).
సెకండరీ బోన్ క్యాన్సర్లలో దేహంలోని...
రొమ్ము, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ్రపోస్టేట్ వంటి ఇతర ్రపాంతాల్లో వచ్చి క్యాన్సర్లు పెరుగుతూ ఆ కణాలు ఎముకలకూ చేరి అలా ఎముక క్యాన్సర్‌కూ కారణమవుతాయి. ఇక... ఏ హానీ చేయని బినైన్ ట్యూమర్స్ అని పిలిచే ఎముక గడ్డల విషయానికి వస్తే... తేడాలను బట్టి వాటిని ఆస్టియోకాండ్రోమా, జెయింట్ సెల్ ట్యూమర్స్ అని పిలుస్తారు. ఇవి ఎముకలపై పెరిగే అంతగా అపాయకరం కాని ‘నాన్ క్యాన్సరస్’ గడ్డలని చెప్పవచ్చు.
చికిత్స...
ఒకసారి ఎముక క్యాన్సర్ నిర్ధారణ చేశాక... ఆ క్యాన్సర్ దశ, వ్యాధి తీవ్రత వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని, ్రపాధాన్యక్రమంలో ఏ చికిత్స ప్రక్రియను తొలుత లేదా ఆ తర్వాత నిర్వహించాలో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఎముక క్యాన్సర్‌కు అవలంబించే సాధారణ చికిత్స ప్రక్రియల్లో
ముఖ్యమైనవి...
⇒ శస్త్రచికిత్స : ఎముకపైన ఉన్న గడ్డనూ... దాంతోపాటు ఆ చుట్టుపక్కల కణజాలాన్ని శస్త్రచికిత్సతో తొలగిస్తారు.
⇒ కీమోథెరపీ : కొన్ని మందులతో క్యాన్సర్ కణాలను తుదముట్టించే ప్రక్రియను కీమోగా చెప్పవచ్చు. ప్రధానంగా ఈ ప్రక్రియను ఆస్టియోసార్కోమా వంటి క్యాన్సర్ల కోసం వాడతారు.
⇒ రేడియేషన్ థెరపీ : అత్యంత శక్తిమంతమైన రేడియేషన్ కిరణాల సహాయంతో క్యాన్సర్‌ను మాడ్చివేసే ప్రక్రియనే రేడియోషన్ థెరపీగా చెబుతారు. సా«ధారణంగా శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ గడ్డలను తొలగించలేని సమయాల్లో డాక్టర్లు ఈ ప్రక్రియను ఎంచుకుంటారు.
అన్ని క్యాన్సర్‌లలో లాగే ఎముక క్యాన్సర్‌నూ ఎంత త్వరగా గుర్తించి, నిపుణులైన డాక్టర్లతో మంచి చికిత్స అందిస్తే ఫలితాలూ అంతే మెరుగ్గా ఉంటాయి. మరీ ముఖ్యంగా... పెరుగుతున్న పిల్లల్లో ఇవి వారి ఎదుగుదలను ప్రభావితం చేయడంతో పాటు కొన్నిసార్లు వైకల్యాలకూ కారణమయ్యే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా వీటిని కనుగొని, తగిన చికిత్స అందించాలి.
బాధితుల్లో కనిపించే మెరుగుదల (్రపోగ్నోసిస్) అనే అంశం... అది ఏ రకమైన క్యాన్సర్ లేదా ఏదశలో దాన్ని కనుగొన్నారు, బాధితుడికి అందుతున్న చికిత్సకు ఎలా ప్రతిస్పందిస్తున్నాడనే అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవల మంచి అధునాతన చికిత్స ప్రక్రియలతో పాటు కొత్త కొత్త చికిత్స ప్రణాళికలు అందుబాటులోకి రావడం, సరికొత్త పరిశోధనలతో వచ్చిన ఆవిష్కరణల కారణంగా బాధితుల్లో మంచి మెరుగుదల కనిపిస్తోంది.
ఎముక క్యాన్సర్‌తో జీవించాల్సి వస్తే...
ఎముక క్యాన్సర్‌తో జీవించాల్సి వచ్చే బాధితులకు తమ కుటుంబసభ్యుల నుంచి, డాక్టర్ల నుంచి ఆరోగ్య సంరక్షకుల నుంచి మంచి సహకరం అవసరం. ఎముక క్యాన్సర్ వచ్చిందని తెలియగానే అన్ని క్యాన్సర్లలో లాగానే బాధితులు షాక్‌కు గురికావడం, జీవితం శూన్యమైనట్లు అనుకోవడం, నిరాశా నిస్పృహలకు గురికావడం వంటివి ఉంటాయి. అయితే వాళ్లు బాగా కోలుకోవడం అన్నది... వాళ్లకు అందే చికిత్సతో పాటు వాళ్లకు నైతిక మద్దతు అందించే కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
తమకు వచ్చిన క్యాన్సర్ రకం, దాని గురించి అవసరమైన సమాచారంతో పాటు తమకు వచ్చిన వ్యాధి గురించి డాక్టర్లు, తమకు నమ్మకమైనవాళ్లతో అరమరికలు లేకుండా చర్చించడం వంటి అంశాలు త్వరగా కోలుకునేలా చేస్తాయి. ఈ క్రమంలో నర్సులూ, తాము తీసుకునే మందులు, తమకు లభించాల్సిన ట్రాన్స్‌పోర్టు సహకారాలూ, బాధితుల బాధల్ని తమవిగా ఎంచి, సహానుభూతితో మద్దతు అందించే సపోర్ట్ గ్రూపుల సహకారం బాగుంటే కోలుకునే ప్రక్రియ కూడా మరింత మెరుగ్గా, వేగంగా జరుగుతుంది. ∙
నిర్ధారణ...
సాధారణంగా ఎక్స్–రే, ఎమ్మారై, సీటీ స్కాన్ పరీక్షలతో పాటు సాధారణంగా చిన్న ముక్క తీసి పరీక్షించే బయాప్సీ ద్వారా ఎముక క్యాన్సర్ నిర్ధారణ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment