సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు కమిషనరేట్‌లోని అబిడ్స్, పంజగుట్ట సహా మరికొన్ని పోలీసుస్టేషన్ల అధికారులకు అనునిత్యం టెన్షనే. తమ పరిధిలో ఉన్న ప్రాంతాలు నిరసనలు, ఆందోళనలు, ముట్టడిలతో అట్టుడికిపోతుంటాయి. ఆయా సమయాల్లో ఆందోళనకారులను అదుపు చేయడానికి, నిర్దేశిత ప్రాంతాల్లో కాపుకాయడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తుంది.
ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నిరసనకారుల నేపథ్యంలో నగరం మొత్తం ఒకే యూనిట్‌గా పని చేయాలని, ఎక్కడిక్కడ వీరిని కట్టడి చేయాలని స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు సమాచారంతో సరి...
► రాజధాని నగరంలో అనునిత్యం ఏదో ఒక నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వీటిలో కొన్ని పోలీసుల అనుమతులతో జరుగుతుంటే... మరికొన్ని ఎలాంటి సమాచారం లేకుండా హఠాత్తుగా సాగుతుంటాయి. ఈ రెండో తరహాకు చెందిన వాటిపై ఆయా సంస్థలు ముందుగానే ప్రకటనలు చేస్తుంటాయి. అలా కానప్పుడూ నగర పోలీసు నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ సమాచారం సేకరిస్తుంటుంది.
ఈ వివరాలను నగరంలోని అన్ని ఠాణాలతో పాటు ప్రత్యేక విభాగాలకు అందిస్తుంటారు. దీని ఆధారంగా దాదాపు ప్రతి పోలీసుస్టేషన్ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేస్తుంటారు. అయితే తమ పరిధి నుంచి వెళ్తున్న నిరసనకారులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేయడానికి మాత్రమే స్థానిక పోలీసులు పరిమితం అవుతున్నారు.
ఈ రెండేళ్లూ పెరిగే అవకాశం...
► దీంతో నిరసనకారులంతా తాము నిరసన తెలిపే ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆ స్థానిక పోలీసులే అదుపు చేయడం, అదుపులోకి తీసుకోవడం చేయాల్సి వస్తోంది. ఇది ఒక్కోసారి తలకుమించిన భారంగా మారి అపశృతులకు కారణమవుతోంది. సాధారణంగా ఎన్నికలకు రెండేళ్లు ముందు నుంచి ఈ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న కొత్వాల్ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఇకపై నిరసనకారుల విషయంలో ప్రతి ఠాణా అధికారులు స్పందించాలని స్పష్టం చేశారు. వీరిని ఎవరికి వారు, ఎక్కడిక్కడ అదుపులోకి తీసుకుని పరిస్థితులను చక్కదిద్దాలని సూచించారు. మరోపక్క ఏదైనా సంచలనాత్మక నేరం జరిగినప్పుడూ స్థానిక పోలీసులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దాన్ని కొలిక్కితెచ్చే పని ప్రత్యేక విభాగాలదన్నట్లు పట్టించుకోవట్లేదు. ఇకపై ఇలాంటివి కుదరదని, కచ్చితంగా స్థానిక పోసులూ తమ వంతు కృషి చేయాలంటూ కొత్వాల్ ఆనంద్ స్పష్టం చేశారు.
వాటి విషయంలో మరింత అప్రమత్తత...
► ప్రభుత్వ నిర్ణయాలతో పాటు అనేక అంశాలపై నిరసన తెలపడానికి సమాయత్తమవుతున్న కొందరు ఆందోళనకారులు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో సామాన్యులకు, ట్రాఫిక్‌కు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని నిర్వాహకులు హామీ ఇస్తున్నారు. వీటికి సంబంధించి పోలీసు అధికారులు సైతం కొన్ని షరతులు విధిస్తున్నారు.
అనుమతి వచ్చిన తరవాత చేపట్టే ఈ నిరసనలు ఒక్కోసారి నిర్వాహకులు చేతులు దాటిపోతున్నాయి. నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు చేయడం, రహదారులపైకి వచ్చి వాహనాలు, సామాన్యులకు ఇబ్బంది కలిగించడం, కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విధ్వంసాలు సైతం చోటు చేసుకుంటున్నాయి.
ప్రధానంగా కలెక్టరేట్లతో పాటు మరికొన్ని సున్నిత, కీలక ప్రాంతాల్లో ఈ అపశృతులు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వీటి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు విభాగం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment