సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సంచరిస్తున్న అంబులెన్స్‌ల కారణంగా సాధారణ వాహనచోదకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యవసరమైన పేషెంట్లను తరలిస్తున్నవి మాత్రమే సైరన్ వినియోగించేలా ఆదేశాలు జారీ చేశారు. వీటిని అతిక్రమించిన వారిపై చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నార్త్ జోన్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెడ్గే స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ కమిషనరేట్‌లో అంబులెన్స్ అసోసియేషన్లు, ఆస్పత్రుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అత్యవసర పేషెంట్లను తీసుకువెళ్లే అంబులెన్స్‌లకు ఎలాంటి అవాంతరాలు లేకుండా గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యేక ఫోన్ నంబర్‌తో ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో(టీసీసీసీ) స్పెషల్ సెల్ అందుబాటులోకి తెచ్చినట్లు వారి దృష్టికి తీసుకువెళ్లారు.
ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ సైరన్లు వేసుకుని ఇష్టానుసారం దూసుకుపోతున్న అంబులెన్స్‌ల వ్యవహారంపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టారు. దీనికోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు నిర్వహించిన తనిఖీల్లో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అత్యవసరం కాని వాహనాలు, ఖాళీగా వెళ్తున్న అంబులెన్స్‌లతో పాటు మృతదేహాలను తరలిస్తున్న సమయంలోనూ కొన్ని అంబులెన్స్ లైట్లు, సైరన్‌లతో హడావుడి చేస్తూ ఇతర వాహనచోదకులకు ఇబ్బంది కలిగిస్తున్నాయని తేల్చారు. అనేక అంబులెన్స్‌లకు సరైన పత్రాలు, అనుమతులు లేవని, కొందరు డ్రైవర్లు మద్యం మత్తులో ఉంటున్నారని వెలుగులోకి వచ్చింది. దీంతో సిటీలో సంచరిస్తున్న అంబులెన్స్‌లకు ‘గ్రీన్ ఛానల్’ ఇవ్వడంపై ఓ విధానానికి రూపకల్పన చేశారు.
ఆ అంశాలను రాహుల్ హెగ్డే ఈ సమావేశంలో ఆయా ప్రతినిధులకు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లోనే ఉన్న పేషెంట్లను తరలించడానికి ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేశారు. ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో పని చేసే దీనికోసం ప్రత్యేక సెల్‌ఫోన్ నంబర్ 8712660600 కేటాయించారు. అత్యవసర పేషెంట్లను తరలిస్తున్న లేదా వారి కోసం వెళ్తున్న అంబులెన్స్‌ల వివరాలను ఆస్పత్రులు లేదా నిర్వాహకులు ఈ సెల్‌తో పాటు ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ ఫోన్: 9010203626కు అందించాలని కోరారు. ఆస్పత్రుల నుంచి అందే వివరాల ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు అంబులెన్స్ ప్రయాణించే రూట్‌లోని జంక్షన్లను అప్రమత్తం చేస్తూ దాని ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చూడనున్నారు. ట్రాఫిక్ అదనపు డీసీపీ ఎస్.రంగారావు తదితరులు పాల్గొన్నారు.
సమన్వయం కోసం ప్రత్యేక నంబర్లు
87126 60600, 90102 03626
Comments
Please login to add a commentAdd a comment