సాక్షి, సిటీబ్యూరో: మాసబ్ చెరువుపై రియల్ మాఫియా ముప్పేట దాడి చేస్తోంది. చుట్టూ ప్రైవేటు సైన్యాన్ని పహారాగా ఏర్పాటు చేసి చెరువును చెరబట్టేస్తోంది. అడ్డుకోవాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండటంతో స్థానికులే చెరువు పరిరక్షణ కమిటీగా ఏర్పడి రాత్రింబవళ్లూ కాపలా కాస్తున్నారు. అయినా అక్రమార్కుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. మట్టి తరలింపు లారీలను లోనికి రాకుండా స్థానికులు ప్రధాన రోడ్డు వైపు నిఘా పెడితే .. అర్ధరాత్రి చెరువు వెనుక భాగం నుంచి పూడ్చివేతను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా జిల్లా కలెక్టర్, రెవెన్యూ, ఇరిగేషన్ ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్లు నిత్యం ఈ చెరువుకట్టపై నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. కానీ.. వీరిలో ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై స్థానికులు ఇటీవల ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడే లేకుండాపోయాడు.
రెండు నెలలుగా పూడ్చివేతలు..
తుర్కయంజాల్ రెవెన్యూ పరిధిలో 495 ఎకరాల విస్తీర్ణంలో మాసబ్ చెరువు విస్తరించి ఉంది. దీనిలో ప్రభుత్వ భూమి 342.32 ఎకరాలు. మరో 152.38 ఎకరాలు ప్రైవేటు పట్టా భూములు. ఈ భూములన్నీ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉన్నాయి. బఫర్‌జోన్‌లో మరో 31.35 ఎకరాలు ఉంది. బఫర్‌జోన్‌లో 9.30 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, 22.5 ఎకరాల పట్టా భూమి ఉంది.
ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉన్న పట్టా భూములను ఏక్ ఫసల్ భూములుగా పిలుస్తుంటారు. చెరువులో నీరు తగ్గినప్పుడు మాత్రమే ఈ భూములను సాగు చేసుకునే అవకాశం ఉంది. నిజానికి ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు, వాణిజ్య కార్యకలాపాలు చేపట్టకూడదు. కానీ ఇప్పటికే ఇక్కడ ఎఫ్‌టీఎల్ భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు, నిర్మాణాలు వెలిశాయి. గత మూడేళ్లుగా కురుస్తున్న వర్షాలకు వరదనీరు భారీగా వచ్చి చెరువులోకి చేరింది.
దీంతో ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పట్టా భూములన్నీ నీటమునిగాయి. ప్రభుత్వ శిఖం భూమిని ఆనుకుని ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉన్న ఈ పట్టా భూములను కొనుగోలు చేసిన కొంత మంది రియల్టర్లు రెండు నెలలుగా పూడ్చివేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందనే ఆరోపణలున్నాయి.
కళ్లుగప్పి.. లారీల్లో మట్టి తరలించి..
చెరువు ఆనవాళ్లను దెబ్బతీస్తున్న రియల్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కొంత మంది స్థానికులు మున్సిపల్ కమిషనర్, రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులతో పాటు జిల్లా కలెక్లర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటికే శిఖం, ఎఫ్‌టీఎల్ పరిధిలో భారీగా మట్టిని నింపారు. రియల్టర్లు నింపిన ఆ మటిని మళ్లీ ఎత్తిపోయించాలని అధికారులు నిర్ణయించారు. ఒకవైపు స్థానిక మున్సిపల్ అధికారులు ఇందుకు ఏర్పాట్లు చేస్తుండగా, ఈ విషయాన్ని గమనించిన సదరు రియల్టర్ కోర్టును ఆశ్రయించారు. ఒకవైపు ఈ వివాదం కొనసాగుతుండగా.. మరోవైపు మరో రియల్టర్ నక్షబాటను లక్ష్యంగా చేసుకుని చెరువు పూడ్చివేతకు పాల్పడుతున్నారు.
కాగా.. సదరు కోర్టు స్టేటస్ కో విధించినట్లు సమాచారం. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పేర్కొంటూ ప్రధాన రహదారి వైపు ఏర్పాటు చేసిన గేటుకు ఓ నోటీసును కూడా అతికించారు. గేటుకు అతికించిన నోటీసు బోర్డును చూసి అధికారులు అటువైపు వెళ్లేందుకు జంకుతున్నారు.
● కళ్ల ముందే చెరువు శిఖం కబ్జాకు గురవుతుండటం, ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు వెలుస్తుండటాన్ని జీర్ణించుకోలేని స్థానికులు వాట్సాప్ గ్రూప్ వేదికగా ఒక్కటయ్యారు. గత పదిహేను రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. మట్టి లోడుతో కూడిన లారీలు లోపలికి వెళ్లకుండా రాత్రి పగలు తేడా లేకుండా అక్కడే కాపు కాస్తున్నా రు. ప్రధాన రహదారిపై నిఘా పెరగడంతో రియల్టర్లు ప్రత్యామ్నాయంగా, గతంలో రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు గుర్రంగూడ నుంచి ఏర్పాటు చేసుకున్న నక్షబాటను ఇందుకు వేదికగా ఎంచుకున్నారు. అందరి కళ్లుగప్పి శనివారం అర్ధరాత్రి దాటాక పెద్ద ఎత్తున మట్టి డంప్ చేస్తుండటంతో చెరువు పరిరక్షణ సమితి సభ్యులు టిప్పర్లను అడ్డుకుని, మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
చర్యలు తీసుకుంటాం
స్థానికుల ఫిర్యాదుతో ఆదివారం పూడ్చివేతలను పరిశీలించాం. నక్షబాట పేరుతో పెద్ద ఎత్తున మట్టి, బండరాళ్లను వేసి పూడ్చివేస్తున్న వారిపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. చెరువు పరిసరాల్లో రెవెన్యూ, పోలీసు నిఘా పెంచుతాం.
– గంగమ్మ, ఏఈఈ, ఇరిగేషన్
Comments
Please login to add a commentAdd a comment