హైదరాబాద్: హయత్‌నగర్‌లో జరిగిన జంట మరణాల కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధాన్ని కొనసాగించలేక మానసికంగా కుంగిపోయిన అల్లవుల రాజేశ్, బత్తుల సుజాతలు బలవన్మరణాలకు పాల్పడ్డారని హయత్‌నగర్ పోలీసుల దర్యాప్తులో తేలింది. పెళ్లయి ముగ్గురు పిల్లలున్న సుజాత వివాహేతర సంబంధాన్ని కొనసాగించలేక, ఆమె ఎడబాటును భరించలేక రాజేశ్‌లు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారని, పథకం ప్రకారమే ఇద్దరూ కలిసి పురుగుల మందు కొనుగోలు చేసి, తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని రాచకొండ పోలీసు కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ వెల్లడించారు. తొలుత హత్యగా కేసు దర్యాప్తును ప్రారంభించిన హయత్‌నగర్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఇవి ఆత్మహత్యలను తేల్చి చెప్పారు. పూర్తి వివరాలను వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డితో కలిసి గురువారం మీడియాకు వివరించారు.
► ములుగు జిల్లా పంచోత్కులపల్లికి చెందిన రాజేశ్ పై చదువుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి చైతన్యపురిలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఏడాది క్రితం రాజేశ్ అనుకోకుండా హయత్‌నగర్‌లోని సిద్దివినాయకనగర్‌లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బత్తుల సుజాతకు మిస్డ్ కాల్ ఇచ్చాడు. అటువైపు కాలర్ ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలంతో మెసేజ్ చేశాడు. దీంతో సుజాత రిప్లై ఇచ్చింది. అలా ఒకరికొకరు పరిచయం ఏర్పడి నిరంతరం చాటింగ్ చేసుకునేవారు. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. చిట్‌చాట్‌తో మొదలైన వారి ప్రేమ.. వివాహేతర సంబంధానికి దారి తీసింది.
► కొంతకాలం తర్వాత సుజాత తరచూ గుర్తు తెలియని వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుండటం ఆమె కుటుంబ సభ్యులు గమనించారు. 15 రోజుల క్రితం సుజాత అనారోగ్యానికి గురైంది. ఆ సమయంలో రాజేశ్ ఆమెకు తరచూ ఫోన్లు, వాట్సాప్ సందేశాలు చేశాడు. అనారోగ్యం కారణంగా ఆమె రిప్లై ఇవ్వలేకపోయింది.
► దీంతో రాజేశ్ ఆమె ఇంటి పరిసరాల్లోకి వచ్చాడు. అతని అనుమానాస్పద కదలికలను గమనించిన సుజాత కూతురు శివాని తన స్నేహితుడు క్రాంతి వంశీకి ఫోన్‌లో సమాచారం ఇవ్వడంతో అతను ఇంటికి వచ్చాడు. ఇప్పటికే రాజేశ్ అక్కడి నుంచి కుంట్లూరు రోడ్‌లోని మిస్టర్ చాయ్ టీ స్టాల్‌కు వెళ్లిపోయాడు. అతన్ని అనుసరిస్తూ వంశీ కూడా వెళ్లాడు. ఇదే విషయాన్ని శివానికి ఫోన్ చేసి చెప్పడంతో ఆమె తన సోదరుడు జైచంద్రకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే అతను తన స్నేహితుడు జస్వంత్‌ను తీసుకొని, టీ స్టాల్ వద్దకు చేరుకున్నారు. జైచంద్ర, జస్వంత్, వంశీ ముగ్గురు కలిసి సుజాత ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావని రాజేశ్‌ను ఆరా తీశారు. ఒకట్రెండు దెబ్బలు కొట్టేసరికి అసలు విషయాన్ని రాజేశ్ వివరించాడు.
► ఆ తరువాత రాజేశ్‌ను బైక్ మీద ఎక్కించుకొని జై చంద్ర, జస్వంత్‌లు వెళ్లిపోయారు. ముగ్గురూ కలిసి సూర్యానగర్ కాలనీ వెనుక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడ రాజేశ్ వివరాలను సేకరించి, తన తల్లి సుజాత ఆత్మహత్యాయత్నం చేసుకుందని, తనని వేధించవద్దని హెచ్చరించి, రాజేశ్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
► మే 24న సాయంత్రం సమయంలో మృతురాలు సుజాత కుంట్లూరు క్రాస్ రోడ్‌కు వచ్చి, ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి, రాఘవేంద్ర ఆగ్రో ఏజెన్సీ దుకాణానికి వెళ్లి పురుగుల మందు కొనుగోలు చేసింది. ఆ తర్వాత రిలయన్స్ మార్ట్ వద్దకు చేరుకొని, అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్న రాజేశ్ చేతికి బాటిల్‌ను ఇచ్చింది. ఆపై ఆమె రిలయన్స్ మార్ట్‌లోకి వెళ్లి యాపిల్స్, చాక్లెట్లు, ఇడ్లీ రవ, మైదా వంటి వస్తువులను కొనుగోలు చేసింది. మార్ట్ నుంచి బయటకు వచ్చాక రాజేశ్ అక్కడి నుంచి కుంట్లూరులోని పాపాయిగూడ రోడ్ శివారు ప్రాంతానికి వెళ్లిపోయి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
► ఇంటికి వెళ్లిన సుజాత మే 24న రాత్రి సమయంలో విషం తాగడంతో కుటుంబ సభ్యులు ఆమెను హయత్‌నగర్‌లోని శ్రీనివాస ఆసుపత్రికి తరలించారు. మెరుగైన ఆరోగ్యం నిమిత్తం ఎల్బీనగర్‌లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. మే 29న సాయంత్రం 4 గంటలకు సుజాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కూడా మరణించింది.
► మే 29న సాయంత్రం 6:30 గంటలకు సీఎస్‌ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న పోలోజు వెంకటేశ్వర్లు కుంట్లూరు వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. బహిరంగ ప్రదేశంలో దుర్వాసన రావటంతో పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రాజేశ్ మృతదేహాన్ని గుర్తించారు.
రాజేశ్, సుజాతలవి బలవన్మరణాలే
మిస్టరీ వీడిన హయత్‌నగర్ జంట మరణాల కేసు
రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment