హైదరాబాద్: ఐటీ కారిడార్ పరిధిలోని ఔటర్‌రింగ్ రోడ్డు ఆధునిక హంగులను సంతరించుకుంటోంది. ఔటర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐటీ, కార్పొరేట్ సంస్థలు శరవేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా ఇందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఔటర్ మీదుగా ఐటీ కారిడార్‌లలోకి ప్రవేశించేందుకు ఇప్పటికే నార్సింగ్ వద్ద కొత్తగా ఒక ఇంటర్‌చేంజ్‌ను ఏర్పాటు చేయగా, ఐటీ సంస్థలు, ఉద్యోగుల రాకపోకల కోసం మరో రెండు చోట్ల ఇంటర్‌చేంజ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ మేరకు పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు రూ. 29.50 కోట్లతో చేపట్టిన నార్సింగ్ ఇంటర్‌చేంజ్‌ను ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇది వినియోగంలోకి రావడంతో వాహనాల రాకపోకలు కూడా గణనీయంగా పెరిగినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ ఇంటర్‌చేంజ్ నుంచి నార్సింగి, మంచిరేవుల, గండిపేట్ ప్రాంతాలతో పాటు లంగర్ హౌస్, శంకర్‌పల్లి తదితర ప్రాంతాలకు చెందిన ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే కోకాపేట్, మల్లంపేట్‌లో ఇంటర్‌చేంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఔటర్ మీదుగా కోకాపేట్‌కు చేరుకోవడం ఎంతో సులువవుతుంది. ఈ రెండు చోట్ల వినియోగంలోకి వస్తే 158 కిలోమీటర్ల ఔటర్ మార్గంలో మొత్తం 22 ఇంటర్‌చేంజ్‌లు ఉంటాయి.
సర్వీస్‌రోడ్ల విస్తరణ...
► మరోవైపు ఐటీకారిడార్‌లకు ఈజీగా రాకపోకలు సాగించేందుకు హెచ్‌ఎండీఏ పెద్ద ఎత్తున సర్వీస్‌రోడ్ల విస్తరణ చేపట్టింది.
► సుమారు 24 కిలోమీటర్ల మార్గంలో రెండు లైన్లు ఉన్న సర్వీస్ రోడ్లను 4 లైన్‌లకు విస్తరిస్తున్నారు. త్వరలోనే అదనపు రోడ్లు అందుబాటులోకి రానున్నాయి.
► హెచ్‌ఎండీఏ అనుబంధ సంస్థ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) సర్వీస్ రోడ్ల విస్తరణ చేపట్టింది. నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు 24 కిలోమీటర్ల మేర ప్రస్తుతం ఉన్న రెండు లైన్‌ల రోడ్లను నాలుగు లైన్‌లకు పెంచుతున్నారు. సుమారు రూ.380 కోట్లతో ఈ పనులు కొనసాగుతున్నాయి.
ఆగస్టు 15న సైకిల్ ట్రాక్ ప్రారంభం
అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన సైకిల్ ట్రాక్ ఆగస్టు 15వ తేదీ కానుకగా అందుబాటులోకి రానుంది. సుమారు రూ.100 కోట్ల అంచనాలతో నానక్‌రామ్‌గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.5 కిలోమీటర్లు, కొల్లూరు నుంచి నార్సింగి వరకు 14.5 కిలోమీటర్ల మార్గంలో సైకిల్ ట్రాక్‌ను సిద్ధం చేశారు. ఇది 5.3 మీటర్ల వెడల్పుతో, మూడు లైన్‌లలో ఉంటుంది.
‘ఐటీ ఉద్యోగులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఈ ట్రాక్‌ను వినియోగించుకోవచ్చు. అద్దె సైకిళ్లు లభిస్తాయి. ట్రాక్ పొడవునా రెస్ట్‌రూమ్‌లు, కెఫెటేరియాలు, బ్రేక్‌ఫాస్ట్ సెంటర్‌లు కూడా ఉంటాయి’. అని ఒక అధికారి వివరించారు. అలాగే సైకిళ్లకు పంక్చర్‌లయినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మరమ్మతులు చేస్తారని చెప్పారు. ప్రథమ చికిత్స కేంద్రాలను కూడా అందుబాటులో ఉంచునున్నట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాలతో నిఘా ఉంటుంది. ట్రాక్‌పై కప్పు కోసం ఏర్పాటు చేసిన సౌరఫలకల వల్ల 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది,
Comments
Please login to add a commentAdd a comment