సిద్ధమైన నార్సింగి ఇంటర్‌చేంజ్
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఇంటర్ చేంజ్ అందుబాటులోకి రానుంది. నార్సింగి వద్ద సుమారు రూ.29.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటర్ చేంజ్‌ను శనివారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ఇంటర్ చేంజ్ వల్ల నార్సింగి, మంచిరేవుల, గండిపేట్ ప్రాంతాలతో పాటు లంగర్ హౌస్, శంకర్‌పల్లి తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఎంతో ప్రయోజనం లభించనుంది. ఔటర్‌పైన రాకపోకలు సాగించే వాహనదారులు నార్సింగి వద్ద ఎక్కేందుకు, దిగేందుకు అనుకూలంగా ర్యాంపులు, రోడ్లను నిర్మించారు.
ఈ ఇంటర్‌చేంజ్ వల్ల ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది. ప్రస్తుతం శంషాబాద్ వైపు నుంచి వచ్చే వాహనదారులు నార్సింగి వైపు వెళ్లేందుకు అవకాశం లేదు, అక్కడి నుంచి నానక్‌రాంగూడ టోల్‌ప్లాజా వరకు వెళ్లి వెనక్కి తిరిగి రావలసి వస్తుంది. దీంతో కనీస 5 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయవలసి ఉంటుంది. శనివారం నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఇంటర్‌చేంజ్ వల్ల ఆ ఇబ్బంది తొలగనుంది. అలాగే మెహదీపట్నం నుంచి కోకాపేట్ వైపు వెళ్లే వాహనదారులకు కూడా దీనివల్ల ప్రయాణం సులువవుతుంది.
ప్రస్తుతం 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డు మార్గంలో 19 చోట్ల ఇంటర్ చేంజ్‌లు ఉన్నాయి. నార్సింగితో ఈ సంఖ్య 20కి చేరింది. వీటితో మల్లంపేట్, కోకాపేట్‌ల వద్ద కూడా హెచ్‌ఎండీఏ ఇంటర్‌చేంజ్‌ల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం ఆ రెండు చోట్ల పనులు కొనసాగుతున్నాయి. ఇవి కూడా పూర్తయితే ఔటర్‌పైన ఇంటర్‌చేంజ్‌ల సంఖ్య 22కు చేరనుంది. భవిష్యత్‌లో వచ్చే డిమాండ్ మేరకు ఔటర్‌మార్గంలో అవసరమైన చోట్ల ఇంటర్‌చేంజ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు.
నేడు కోకాపేట ఎస్టీపీ ప్రారంభం
జలమండలి నూతనంగా నిర్మించిన కోకాపేట మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వీటిని జలమండలి ఎండీ దానకిశోర్ శుక్రవారం సందర్శించి పరిశీలించారు. కోకాపేట ఎస్టీపీని ప్యాకేజీ–2 లో భాగంగా.. 15 ఎంఎల్డీల సామర్థ్యం, ఆధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ (ఎస్బీఆర్) టెక్నాలజీతో నిర్మించారు. ఈ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నీటిని మురుగు శుద్ధి చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment