సదస్సులో ప్రసంగిస్తున్న హోం మంత్రి మహమూద్ అలీ
సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్: రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులు పగలూ, రేయీ శ్రమించి శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కలను సాకారం చేశారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణనే మహిళలకు ఎక్కువ సేఫ్ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్‌సీఎస్‌సీ) బుధవారం ‘షీ ట్రంప్స్ విత్ రెస్పెక్ట్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్‌మెంట్’ (సీ్త్ర) పేరిట నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో (ఐసీసీసీ) ఉన్న ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. ‘సీ్త్ర’ సదస్సు అతివలకు ఎంతో ఉపయుక్తమన్నారు. మహిళల భద్రత అంశంలో సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. హెచ్‌సీఎస్‌సీతో పాటు హైదరాబాద్ పోలీసులు మహిళల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారని, నగరాన్ని సేఫ్ సిటీగా మారుస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తీసుకున్న అనేక వినూత్న, వేగవంతమైన చర్యలు నగర పోలీసింగ్ స్వరూప స్వభావాలనే మార్చేస్తున్నాయని, మహిళల రక్షణకు ఆయన పెద్దపీట వేస్తున్నారని కితాబిచ్చారు.
‘సీ్త్ర’ ఓ మైలురాయి..
నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ... ‘హెచ్‌సీఎస్‌సీ ప్రస్థానంలో ‘సీ్త్ర’ ఓ మైలురాయి. అతివల కోసం తెలంగాణ ప్రభుత్వం ఆది నుంచీ అనేక భద్రతా చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు 176 ఏళ్ల చరిత్ర ఉంది. తొలిసారిగా 2022లోనే ఓ మహిళకు లా అండ్ ఆర్డన్ స్టేషన్‌కు ఇన్‌స్పెక్టర్‌గా పోస్టింగ్ వచ్చింది. లాలాగూడ ఠాణాకు మధులత పోస్టింగ్‌తో మొదలు పెట్టి ఇప్పటి వరకు నలుగురిని నియమించాం. ఈ కోణంలోనూ మహిళా సాధికారత కోసం సిటీ పోలీసు విభాగం కృషి చేస్తోంది. యువత ముందుకు వచ్చి హెచ్‌సీఎస్‌సీలో వలంటీర్లుగా చేరాలి’ అని పేర్కొన్నారు.
అనుభవాలను పంచుకుని..
సదస్సులో ప్రసంగించిన హోంమంత్రి మహమూద్ అలీ, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. వీటి ద్వారా హైదరాబాద్ నగర పోలీసుల స్పందన, ఇక్కడ మహిళల రక్షణపై ఇతర రాష్ట్ర పోలీసులకు ఉన్న నమ్మకంపై ఇలా వివరించారు.
వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెట్టి..
‘ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ నగరానికి వచ్చారు. ట్యాక్సీ ఎక్కి ఆ డ్రైవర్‌ను సమీపంలోని పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లమన్నారు. అతడు పంజగుట్ట ఠాణాకు తీసుకుపోగా.. లోపలకు వెళ్లిన ఆమె తన సెల్‌ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశారు. అది పోకపోయినా కేవలం పోలీసుల స్పందన తెలుసుకోవడానికే ఇలా చేశారు. పోలీసుస్టేషన్ నుంచి బయటకు వచ్చిన ఆమె తన అనుభవాన్ని చెబుతూ దేశంలోని మరే ఇతర నగరంలోనూ ఇలాంటి స్పందన, బాధ్యతాయుతమైన పోలీసింగ్ చూడలేదని వ్యాఖ్యానిస్తూ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఓ మీడియా మిత్రుడు ఆ వీడియో నాకు షేర్ చేశారు. ఇది చూసి ఎంతో గర్వించా. బుధవారం ఉదయం జరిగిన ఓ సమావేశంలో కలిసిన ఢిల్లీ అధికారులు సైతం నగరానికి కితాబిచ్చారు. ఇతర రాష్ట్రాల్లో మహిళలు రాత్రి 9 దాటితే బయటకు రారని, వచ్చినా మెడలో ఏమీ ఉండవని, తెలంగాణలో ఆ పరిస్థితి కనిపించలేదని చెప్పారు’
– మహమూద్ అలీ, హోంమంత్రి
హైదరాబాదే సేఫెస్ట్ సిటీ అన్నారు..
‘ఢిల్లీకి చెందిన నా బ్యాచ్‌మేట్ ప్రస్తుతం నాగాలాండ్ కేడర్‌లో పని చేస్తున్నారు. ఆయన కుమార్తె ఇటీవలే ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకుంది. ఆమెకు చైన్నె, బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లోనూ మూడు ఉద్యోగాలు వచ్చాయి. నా బ్యాచ్‌మేట్ మాత్రం నగరాన్నే ఎంచుకుని ఉద్యోగంలో చేర్చడానికి తీసుకువచ్చారు. ఈ విషయం నాకు చెప్పడంతో మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించా. భోజనం చేస్తూ ఆ రెండు నగరాలు కాదని హైదరాబాద్‌నే ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించా. మహిళలు, యువతులను ఇదే అత్యంత భద్రమైన నగరం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ పోలీసు విభాగాలకు ఇదో పెద్ద విజయంగా భావిస్తున్నా’.
– సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
నగర పోలీసింగ్ సూపర్..
ఢిల్లీ, ముంబై నగరాలలో మగువల భద్రత విషయంతో పోలిస్తే తెలంగాణ పోలీసింగ్ అద్బుతంగా ఉందని, చాలా బాగా పని చేస్తున్నారని సినీనటి ఫరియా అబ్దుల్లా అన్నారు. సీ్త్ర సమిట్–2023లో ఆమె సాయంత్రం సెషన్‌లోని పాల్గొని మాట్లాడుతూ.. ఇక్కడ మహిళల భద్రత, రక్షణకు పెద్దపీట వేస్తున్నారని అభినందించారు. షీటీమ్స్ లాంటి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అతివలకు అవసరమైన భద్రతను, భరోసాను కల్పించడంలో హైదరాబాద్ పోలీసులు ముందున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment