సాక్షి, హైదరాబాద్: మహానగరంలో వానొస్తే వరదలు.. రోడ్లు చెరువులుగా మారడం తెలిసిందే. అందుకు కారణం వరదనీరు సాఫీగా పారే నాలాలు కబ్జాలపాలై కొన్ని చోట్ల.. వ్యర్థాలతో నిండి చాలాచోట్ల నీరు పారే దారి లేక పోవడమే అందుకు ప్రధాన కారణమని తెలుసు.
వాటితోపాటు నగరంలోని చాలా చెరువులు సైతం కబ్జాల పాలై నీరు నిలిచే పరిస్థితి లేకపోవడం కూడా ముంపునకు మరో కారణం. ముంపు సమస్యల పరిష్కారానికి రెండు దశాబ్దాల నుంచి రెండేళ్ల క్రితం వరకు వివిధ పనులు చేపట్టారు. అవి ఇప్పటికీ పూర్తికాలేదు.
సమస్య గుర్తించినా..
వరద సమస్యల పరిష్కారానికి నాలాల విస్తరణ, ఆధునికీకరణే శరణ్యమని రెండు దశాబ్దాల క్రితమే గుర్తించారు. కిర్లోస్కర్, వాయెంట్స్ కమిటీల సిఫార్సుల మేరకు విస్తరణ పనులు కొంత మేర చేపట్టి.. ఆ తర్వాత నిలిపి వేశారు. వరద సమస్యల పరిష్కారానికి వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకాన్ని (ఎస్‌ఎన్‌డీపీ) రెండేళ్ల క్రితం చేపట్టారు.
ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. వాటికంటే ముందు దాదాపు రూ. 452 కోట్లతో నాలాల విస్తరణ పనులు చేపట్టారు. అవి సైతం ఇంతవరకు పూర్తికాలేదు. కొత్తవి, పాతవి ఏవీ పూర్తికాకపోవడంతో వానొస్తే నగరంలో ముంపు సమస్యలు తప్పేలా లేవు.
చెరువుల పనులూ కాలేదు..
జీహెచ్‌ఎంసీ పరిధిలో 185 చెరువులుండగా, వివిధ పథకాల ద్వారా పూడికతీత, మరమ్మతులు, పునరుద్ధరణ, అలుగు, తూముల ఏర్పాటు వంటి పనులు చేస్తున్నారు. వీటితోపాటు మురుగునీటి మళ్లింపు, చెరువుకట్టల ఆధునీకరణ, ఫెన్సింగ్ తదితర పనులు చేపట్టారు. తద్వారా ముంపు సమస్యలు తగ్గుతాయని భావించారు.
అలా 355 పనులకు రూ.345 కోట్లు మంజూరు కాగా, రూ.108.29 కోట్లతో 191 పనులు మాత్రం పూర్తయ్యాయి. 144 పనులు పురోగతిలో ఉన్నాయి. 20 పనులు వివిధ కారణాలతో పెండింగ్‌లో పడ్డాయి. ఇవి కాక రాష్ట్రప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ కోసం 19పనులకు రూ.282.63 కోట్లు మంజూరు చేయగా, వాటిల్లో రూ.132.21 కోట్లతో 8 పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి కాలేదు. నిధుల విడుదల కాకపోవడమే ఇందుకు కారణం.
పూర్తి కాని పనుల్లో..
పూర్తికాని నాలాల పనులు పాతవాటిలో కిషన్‌బాగ్ నాలా రిటైనింగ్ వాల్, సన్నీగార్డెన్ – శివాజీనగర్ వరకు ముర్కి నాలా రిటైనింగ్ వాల్ ఆధునీకరణ, నూరమ్మచెరువు నుంచి మీరాలం ట్యాంక్ వరకు (వయా శివరాంపల్లి చెరువు, ఊర చెరువు, ప్రభాకర్‌జీ కాలనీ) కల్వర్టులు, ఉందాసాగర్ నుంచి పల్లెచెరువు వరకు రిటైనింగ్ వాల్, బహదూర్‌పురా నాలా కల్వర్టు, రిటైనింగ్ వాల్ తదితరమైనవి ఉన్నాయి. వీటితో పాటు పలు ప్రాంతాల్లో పనులు పూర్తి కాలేదు. ఓవైపు నాలాలు, మరోవైపు చెరువుల పనులు పూర్తి కాకపోవడంతో నగరంలో వానా కాలం సమస్యలు తీరలేదు.
Comments
Please login to add a commentAdd a comment