హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు పార్కులో ఉన్న చెట్లను కొట్టేసిన వైనమిది. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 72లోని జీహెచ్‌ఎంసీ పార్కులో గత రెండు, మూడు రోజులుగా భారీ చెట్లను కొట్టేస్తుండటంతో కాలనీవాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉన్న చెట్లను కొట్టేసి కొత్తగా మొక్కలు నాటడం ఏంటని అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు.
జూబ్లీహిల్స్ రోడ్ నెం. 72లో ప్రశాసన్‌నగర్ రోడ్డులో ఈ విశాలమైన పార్కులో దశాబ్ధాలుగా చెట్లు పెరుగుతున్నాయి. అయితే హరితహారంలో 2 వేల మొక్కలు నాటేందుకు సంబంధిత యూబీడీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ మొక్కలు నాటేందుకు ఈ పార్కులో సుమారుగా 20 భారీ చెట్లను కొట్టేశారు. ఇదేమిటని కాలనీవాసులు అడిగితే మాకేమి తెలియదంటూ చేతులెత్తేశారు.
కొట్టేసిన చెట్ల కొమ్మలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. జీహెచ్‌ఎంసీ సర్కిల్–18 యూబీడీ నిర్వాహకులు ఈ వ్యవహారంపై నోరుమెదపడం లేదు. కాంట్రాక్టర్ కొట్టేశాడని అటవీ శాఖాధికారులకు చెప్పి కేసు నమోదు చేయిస్తామంటూ బుకాయించారు.
ఇన్ని చెట్లు కొట్టేశాక కేసు పెడితే ఉపయోగం ఏంటంటూ కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశం అయింది. హరితహారం సమయంలో పచ్చని చెట్లను కొట్టేయడం ఏ మేరకు సమంజసమో జీహెచ్‌ఎంసీ అధికారులే తెలపాలంటూ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment