హైదరాబాద్: అసలే చాలీచాలని జీతం... ఆపై పెరిగిన ఖర్చులు... ఇవి చాలవన్నట్లు తండ్రి చేసిన అప్పులు... వెరసీ.. కస్టమర్ కేర్ స్పెషలిస్ట్‌గా ఉన్న పటేల్ మోతీరామ్ రాజేష్ యాదవ్‌ను నేరబాట పట్టించాయి. జూబ్లీహిల్స్‌లో నివసించే వ్యాపారి రాజు ఇంట్లోకి ఈ నెల 12న ప్రవేశించి, ఆయన కుమార్తె సహా కుటుంబీకులను ఆరు గంటలు నిర్బంధించి రూ.10 లక్షలు దోచుకుపోయిన ఇతగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న సిబ్బందిని మంగళవారం తన కార్యాలయంలో అభినందించిన కొత్వాల్ సీవీ ఆనంద్.. కేసు పూర్వాపరాలు వెల్లడించారు. ప్రస్తుతం మాదాపూర్‌లోని ఓ సంస్థలో కస్టమర్ కేర్ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్న రెజిమెంటల్ బజార్ వాసి రాజేష్ తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం నేరాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఉన్న క్రైమ్ సిరీస్‌లు వరుసపెట్టి చూసిన ఇతగాడు దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నాడు. వాటి ద్వారానే ఏ ఆధారాలు దొరక్కుండా ఎలా చేయాలో కూడా నేర్చుకున్నాడు. మూడేళ్ల క్రితం మరో సంస్థలో పని చేసిన ఇతగాడిని నిత్యం కంపెనీ క్యాబ్ వచ్చి పికప్ చేసుకుని వెళ్లేది. ప్రతి రోజూ జూబ్లీహిల్స్ రోడ్ నెం.52లో మరికొందరినీ ఈ క్యాబ్ ఎక్కించుకునేది. అప్పట్లో రాజేష్ ప్రతి రోజూ రాజు ఇంటిని చూసేవాడు. దాని తీరుతెన్నులు, వచ్చిపోయే వాళ్లు ఇప్పటికీ గుర్తుండిపోవడంతోనే ఆ ఇంటిని టార్గెట్ చేసుకున్నాడు. నేరం చేయడానికి ఒక రోజు ముందు రెక్కీ చేశాడు.
అదే రోజు అర్ధరాత్రి దాటాక ఇంట్లోకి ప్రవేశించి, గర్భిణిగా ఉన్న రాజు కుమార్తె నవ్య మెడపై కత్తి పెట్టి రూ.20 లక్షలు డిమాండ్ చేశాడు. ఆమె తమ ఇంట్లో ఉన్న రూ.2 లక్షలకు అదనంగా మరో చోట ఉన్న భర్త నుంచి మరో రూ.8 లక్షలు తెప్పించి ఇచ్చింది. ఈ ఆరు గంటలూ అతగాడు ఆమెతో ఆంగ్లంలో మాట్లాడుతూ, వివిధ రకాలైన అప్లికేషన్లు, సాఫ్ట్‌వేర్స్‌పై చర్చించాడు. చివరకు నవ్య ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని పరారయ్యాడు. 1200 ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌తో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లిన జూబ్లీహిల్స్ పోలీసుల నిందితుడిని అరెస్టు చేసి రూ.9.5 లక్షలు రికవరీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment