
హైదరాబాద్: గ్యాస్ లీకేజీ అయి మంటలు అంటుకొని ఒకరు మృతి చెందగా..ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫిలింనగర్ మహాత్మాగాంధీ నగర్ వడ్డెర బస్తీలోని వాంబే కాలనీలో కారు డ్రైవర్‌గా విధులు నిర్వహించే మిర్యాల రమేష్ (38), భార్య శ్రీలత (32), కుమారుడు హర్షవర్ధన్ (13), కూతురు సీతామహాలక్ష్మి(8)తో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరంతా ఎప్పటిలాగే ఆదివారం రాత్రి భోజనాలయ్యాక నిద్రపోయారు.
సోమవారం ఉదయం రమేష్ లేచి లైట్ వేయగా స్పార్క్‌కు ఒక్కసారిగా ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. అంతకుముందే గ్యాస్ లీకేజీ అయి ఇళ్ళంతా వ్యాపించగా ఇదంతా గమనించని రమేష్ ఎప్పటిలాగే లేచి లైట్ వేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నిద్రిస్తు న్న భార్య, పిల్లలను అప్రమత్తం చేసిన రమేశ్ వారిని బయటకు పంపించే ప్రయత్నంలో తాను తీవ్రంగా గాయపడ్డాడు.
అప్పటికే మంటలు ఎక్కువవడంతో భార్య శ్రీలత కూడా తీవ్రంగా గాయపడింది. ఈ విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే 108కు ఫోన్ చేయగా..సిబ్బంది గాయపడిన వారందర్నీ ఉస్మానియా ఆస్పత్రి కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమేష్ మృతిచెందాడు. ఆయన భార్య శ్రీలత 90 శాతం గాయాలతో చికిత్స పొందుతుండగా..పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పిల్లలు 15 శాతం గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment