హైదరాబాద్: ఇంతింలై వటుడింతై అన్నట్లుగా ఖైరతాబాద్ మహాగణపతి ప్రస్థానం 1954లో ఒక్క అడుగుతో ప్రారంభమై 69వ సంవత్సరాలకు చేరుకుంది. ఈసారి పర్యావరణ హితంగా పూర్తిగా మట్టితో తయారు చేసిన మహాగణపతి 63 అడుగుల ఎత్తులో శ్రీ దశమహా విద్యాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. శుక్రవారం సాయంత్రం మహాగణపతికి నేత్రోనిలం (కంటిపాప ఏర్పాటు) కార్యక్రమాన్ని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నిర్విఘ్నంగా పూర్తి చేశారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా ఖైరతాబాద్ మహాగణపతిని వివిధ రూపాల్లో తీర్చి దిద్దుతున్న శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
నా పూర్వజన్మ సుకృతం..
ఖైరతాబాద్ మహాగణపతిని ఏటా వివిధ రూపాల్లో తీర్చిదిద్దే అద్భుత అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. వినాయకచవితి వచ్చిందంటే ఎక్కడ ఉన్నా మహాగణపతి తయారీకి తప్పక వస్తాను. గత 40 సంవత్సరాలుగా మహాగణపతి సేవలో ఉన్నాను. ఈ సంవత్సరం మట్టితో మహాగణపతి అద్భుతంగా రూపుదిద్దుకుంది. 2020లో మొదటిసారిగా మట్టితో 12 అడుగుల ఎత్తులో.. ఆ తర్వాత 2022లో, 2023.. ఈ సంవత్సరం మట్టితోనే అద్భుతంగా తయారైంది.
ఈసారి ప్రత్యేకతలేమిటంటే..
63 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పులో, 45 టన్నుల బరువుతో శ్రీ దశమహా విద్యాగణపతిగా విఠల శర్మ సిద్ధాంతి సూచనల మేరకు నామకరణం చేసి, ఆయన ఇచ్చిన సూచనల మేరకే రూపు దిద్దుకుంది. ఒక చేతిలో గ్రంథం, వరాహదేవితో కలిసి ఉన్న మహాగణపతికి పూజ చేస్తే అన్ని శుభాలే జరుగుతాయి.
మహాగణపతికి ప్రాణ ప్రతిష్ట ఇలా..
నేత్రోనిలనం చేయడం అంటే కంటి పాప అమర్చడం. ఇలా చేయడం వల్ల మహాగణపతికి రూపం వస్తుంది. వినాయక చవితి రోజు కలశ పూజ పూర్తి చేయడం ద్వారా ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది.
సుదర్శన్ లేని లోటు కనిపించింది..
గత సంవత్సరం వరకు ఉత్సవ కమిటీ చైర్మన్‌గా ఉన్న సింగరి సుదర్శన్ మరణానంతరం ఆయన లేని లోటు కనిపించింది. ఆయన ఆశీర్వాదంతోనే మహాగణపతి పనులను ఎప్పుడూ లేని విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు దగ్గరుండి ప్రతీ పని చేస్తూ వచ్చాను.
మట్టి వినాయకుడి ప్రత్యేకతలివీ..
మహాగణపతిని రూపొందించడానికి ఒక్క చుక్క పీఓపీ కూడా వాడలేదు. మొదటగా స్టీల్‌తో రూపు తీసుకువచ్చి ఆ తర్వాత జాళీని అమర్చి దానిపై గడ్డి, మట్టితో రెండో లేయర్, దానిపై ఔట్‌లేన్‌గా శాండ్, సుతిలి, ఓపీపోట్లు పౌడర్లను కలిపి మరో లేయర్, మట్టి, సుతిలి పౌడర్, బట్టతో మరో లేయర్ అమర్చి దానిపై ఫినిషింగ్ తీసుకువచ్చాం. ఇలా మొత్తం అయిదు లేయర్లు ఉన్నాయి.
అయిదు లేయర్లపై వాటర్ పెయింట్స్ వాడటం వల్ల వర్షం నిరంతరంగా 4–5 గంటలు పడినా విగ్రహం ఏమాత్రం కరగదు. ఎలాంటి పగుళ్లకు అవకాశం లేదు. నిమజ్జన సమయంలో వర్షం పడి నా ఏ ఇబ్బందీ ఉండదు. నిమజ్జనం పూర్తిగా జరిగితే 8 గంటల్లో నీటిలో కరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment