సిటీపై కమాండ్‌.. నేరగాళ్లపై కంట్రోల్‌! | - | Sakshi
Sakshi News home page

సిటీపై కమాండ్‌.. నేరగాళ్లపై కంట్రోల్‌!

Published Tue, Sep 26 2023 7:36 AM | Last Updated on Tue, Sep 26 2023 7:53 AM

- - Sakshi

హైదరాబాద్: ఉల్లంఘనుల్లో క్రమశిక్షణ పెంచడం...స్వైర‘విహారం’ చేసే నేరగాళ్లకు చెక్‌ చెప్పడం...వాహనచోదకులు గమ్యం చేరుకునే సమయాన్ని గణనీయంగా తగ్గించడం... విపత్కర పరిస్థితుల్లో సత్వర స్పందన... ఈ లక్ష్యాలతో ఏర్పాటైన అత్యాధునిక వ్యవస్థే ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఐటీఎంఎస్‌). బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ లో ఇదీ ఓ అంతర్భాగమే. రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ సోమవారం ఆవిష్కరించిన ‘2306 సేఫ్‌ సిటీ ప్రాజెక్టు సీసీ కెమెరాలు’ ఈ కోణా ల్లో కీలకపాత్ర పోషించనున్నాయి. వీటిలో కొన్ని ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పనిచేస్తాయి.

‘ప్లేటు’ మారితే పట్టేస్తుంది...
నేరగాళ్లు, ఉల్లంఘనులు పోలీసుల్ని తప్పించుకోవడానికి అనేక ఎత్తులు వేస్తుంటారు. ఇందులో భాగంగా ఇతర వాహనాల నెంబర్లకు తమ వాహనాల నెంబర్‌ ప్లేట్లపై వేసుకుని సంచరిస్తుంటారు. ఆటోమేటిక్‌ నెంబర్‌ ప్లేట్‌ రీడింగ్‌ సిస్టం (ఏఎన్‌పీఆర్‌) సాఫ్ట్‌వేర్‌ ఈ తరహా కేటుగాళ్లకు చెక్‌ చెబుతుంది. ఈ వ్యవస్థ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ) ద్వారా ఆర్టీఏ సర్వర్‌తో అనుసంధానించి ఉంటుంది. నగర వ్యాప్తంగా ఉండే కెమెరాల ద్వారా ఒకే నెంబర్‌తో రెండు వాహనాలు, కార్ల నెంబర్లతో ద్విచక్ర వాహనాలు, వేరే నెంబర్లతో తిరిగే ఆటోలను తక్షణం గుర్తిస్తుంది. ఆ విషయాన్ని ఆ వాహనం ప్రయాణించే ముందు జంక్షన్లలో ఉన్న క్షేత్రస్థాయి పోలీసులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తుంది.

వాహన ‘మార్గాలను’ చెప్పేస్తుంది...
నగర వ్యాప్తంగా సంచరించే వాహనాల ట్రాకింగ్‌ విధానం సైతం ఐటీఎంఎస్‌ ద్వారా అందుబాటులోకి రానుంది. 250 జంక్షన్లలో ఉండే సీసీ కెమెరాలు ఆయా ప్రాంతాల్లో సంచరించే ప్రతి వాహనాన్నీ నెంబర్‌తో సహా చిత్రీకరించి సర్వర్‌లో నిక్షిప్తం చేస్తాయి. ఏదైనా నేరానికి పాల్పడిన వాహనమో, అనుమానిత వాహనమో ఏ ప్రాంతం నుంచి ఏ సమయంలో ఎక్కడికి ప్రయాణించిందో క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా కలుగుతుంది. సీసీసీలోని సిబ్బంది తేదీ, వాహనం నెంబర్‌ను ఎంటర్‌ చేసి సెర్చ్‌ చేస్తే చాలు.. ఆయా రోజుల్లో సదరు వాహనం ఎక్కడ నుంచి నగరంలోకి ప్రవేశించింది? ఏ సమయంలో ఎక్కడ ఉంది? ఏఏ మార్గాల్లో ప్రయాణించింది? ఎక్కడెక్కడ ఆగింది? తదితర అంశాలను తెలియజేస్తుంది. కిడ్నాప్‌, స్నాచింగ్‌ వంటి నేరాలు జరిగినప్పుడు ఈ వ్యవస్థ అందించే ఆధారాలు కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించనున్నాయి.

జంక్షన్ల వారీగా వాహన కౌంటింగ్‌...
ప్రతి చౌరస్తా నుంచి నిమిషనిమిషానికీ ముందుకు సాగే వాహనాలను లెక్కించే ప్రక్రియ సైతం ఐటీఎంఎస్‌లోని సాఫ్ట్‌వేర్స్‌లో ఉన్నాయి. ఓ నిమిషం కాలంలో సదరు జంక్షన్‌ను ఎన్ని వాహనాలను దాటాయి? వాటిలో ద్విచక్ర, త్రిచక్ర, తేలికపాటి వాహనాలతో పాటు భారీ వాహనాలు, బస్సులు ఎన్ని? అనే అంశాన్ని ప్రత్యేక పరికరాల ద్వారా సాఫ్ట్‌వేర్‌ లెక్కిస్తుంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీసీసీలో ఉండే సిబ్బందికి తెలియజేస్తుంది. ఫలితంగా ఆయా సమయాల్లో ఏఏ రూట్లు బిజీగా ఉన్నాయో తెలుసుకునే సిబ్బంది ఆ విషయాన్ని జంక్షన్లలో ఉండే ప్రత్యే క బోర్డుల ద్వారా వాహనచోదకులకు అందిస్తారు.

వీఎంఎస్‌లతో నిరంతరం సందేశాలు...
ఐటీఎంఎస్‌ ద్వారా ప్రతి జంక్షన్‌లోనూ ఏర్పాటయ్యే వీఎంఎస్‌లు(వేరియబుల్‌ మెసేజ్‌ సైన్‌ బోర్డులు) ట్రాఫిక్‌ స్థితిగతులపై నిరంతర సందేశాలు ఇవ్వనున్నారు. ఓ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనచోదకుడికి ముందు రానున్న చౌరస్తా, రహదారిలో ట్రాఫిక్‌ స్థితిగతుల్ని ఎప్పికప్పుడు వీఎంఎస్‌ల్లో ప్రదర్శితమవుతాయి.

ఉల్లంఘనులకు ‘ఈ’ చెక్‌...
జంక్షన్లలో ఉన్న ఫ్రీ–లెఫ్ట్‌ను ఉల్లంఘిస్తూ ఆయా చోట్ల వాహనాలు ఆపినా... వన్‌వే నిబంధనను ఉల్లంఘించినా, వాహనాలు రాంగ్‌ రూట్లలో దూసుకువస్తున్నా... ప్రస్తుతం ఆయా చోట్ల ఉండే క్షేత్రస్థాయి పోలీసులే చర్యలు తీసుకోవాలి. ఐటీఎంఎస్‌ వ్యవస్థలో అన్ని జంక్షన్లతో పాటు రాంగ్‌రూట్‌, వన్‌వే ఉల్లంఘన అవకాశం ఉన్న ప్రాంతాల్లోనూ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. సర్వర్‌తో అనుసంధానించి ఉండే ఈ కెమెరాలు వాటంతట అవే ఆయా ఉల్లంఘనుల వాహనాలను ఫొటో తీస్తారు. సర్వర్‌ ఆధారంగా ఈ–చలాన్‌ సైతం ఆటోమేటిక్‌గా సంబంధింత వాహనచోదకుడి చిరునామాకు చేరిపోతుంది. దీంతో పాటు నో–పార్కింగ్‌, కమ్యూనిటీ పార్కింగ్‌, పెయిడ్‌ పార్కింగ్‌ ప్రాంతాలనూ జీయో ట్యాకింగ్‌, ఫెన్సింగ్‌ ద్వారా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.

ఐసీసీసీ ఆధీనంలో ఏ కెమెరాలు ఎన్నంటే..?
​​​​​​​
ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాక్స్‌, పీటీజెడ్‌, ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు 10 వేలు

నగర వ్యాప్తంగా వివిధ కీలక ప్రాంతాల్లోనివి 126

మూడు కమిషనరేట్లలోని 2828 జంక్షన్లలోనివి

బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసి 38 ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ కెమెరాలు

నేను సైతం, కమ్యూనిటీ ప్రాజెక్టుల కింద ఏర్పాటైన 4,99,869 (అవసరమైనప్పుడు యాక్సస్‌ చేయవచ్చు)

జీపీఎస్‌ పరిజ్ఞానం ఉన్న గస్తీ వాహనాలకు ఏర్పాటు చేసినవి 1322

ట్రాఫిక్‌ నిర్వహణతో పాటు నేరగాళ్లకూ చెక్‌

దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్‌ వ్యవస్థగా రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement