హైదరాబాద్: కిరాణా దుకాణం ద్వారా వచ్చే ఆదాయంతో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా గడిచిపోతున్న ఆ కుటుంబంలో అగ్ని ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దుకాణంలో మంటలు చెలరేగడంతో దంపతులిద్దరూ అసువులు బాసిన ఘటన మూసాపేట గూడ్స్‌షెడ్ రోడ్డులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. గూడ్స్ షెడ్ రోడ్డులో నివాసముంటున్న దివ్యాంగుడు శ్రీ రాములు యాదవ్ (48)కు భార్య స్వప్న (39), ఇద్దరు కూతుళ్లు, తల్లి ఆండాళ్ ఉన్నారు.
శ్రీరాములు కిరాణా దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కిరాణా దుకాణాంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. చిప్స్ ప్యాకెట్, పూజా ఆయిల్ అదే ప్రాంతంలో ఉండటంతో మంటలు ఒక్కసారిగా భారీగా వ్యాపించాయి. శ్రీరాములు దివ్యాంగుడు కావటం, ఆయన తల్లి వృద్ధురాలు కావటంతో వీరిద్దరు సురక్షితంగా బయటికి రాలేకపోయారు.
వీరిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నంలో శ్రీరాములు భార్య స్వప్న మంటల్లో చిక్కుకుంది. స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్‌కు, పోలీసులకు సమాచారం అందించి వారిని బయటకు తీసుకువచ్చారు. అప్పటికే భార్యాభర్తల శరీరాలు ఎక్కువ శాతం కాలిపోయి గాయాలపాలయ్యారు. గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శ్రీరాములు, స్వప్న మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment