హెజ్‌బొల్లా రాకెట్ల దాడిలో ఏడుగురు మృతి
జెరుసలేం: లెబనాన్‌లోని హెజ్‌బొల్లా గ్రూపు గురువారం ఇజ్రాయెల్‌పైకి భారీ సంఖ్యలో రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో మెటులా ప్రాంతంలో ఆలివ్ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే నలుగురు విదేశీ కారి్మకులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన కార్మికులు ఏ దేశస్తులో అధికారులు వెల్లడించలేదు. అక్టోబర్ మొదట వారంలో ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్‌పై భూతల దాడులకు దిగాక హెజ్‌బొల్లా చేపట్టిన అతిపెద్ద దాడి ఇదేనని చెబుతున్నారు.
పెద్ద సంఖ్యలో రాకెట్లు ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలోని హైఫా పైకి దూసుకొచ్చినట్లు సమాచారం. ఇలా ఉండగా, ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్లే రాకెట్ ఒకటి బుధవారం లెబనాన్‌లోని తమ శాంతి పరిరక్షక దళం బేస్‌పై పడిందని ఐర్లాండ్ ప్రభుత్వం తెలిపింది. ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఆ రాకెట్ దానంతటదే పడిందా, లేక ఇజ్రాయెల్ ఆర్మీ కూల్చిందా అనేది తెలియాల్సి ఉందని పేర్కొంది.
గాజాలో 25 మంది మృతి: డెయిర్ అల్–బలాహ్: గాజాలోని నుసెయిరత్ శరణార్ధి శిబిరంపై ఇజ్రాయెల్ ఆర్మీ గురు, శుక్రవారాల్లో జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 25కు చేరుకుంది. వీరిలో ఐదుగురు చిన్నారులున్నట్లు అల్ అక్సా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వీరిలో పదేళ్ల చిన్నారి, 18 నెలల వయస్సున్న ఆమె సోదరుడు ఉన్నారు. దాడి తర్వాత వీరి తల్లి ఆచూకీ కనిపించడం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. చిన్నారుల తండ్రి నాలుగు నెలల క్రితం ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడని వారు చెప్పారు.
ఐరాస కార్యాలయం ధ్వంసం
వెస్ట్‌బ్యాంక్‌లోని నూర్‌షమ్స్ శరణార్ధి శిబిరంలో ఉన్న ఐరాస శరణార్థి విభాగం కార్యాలయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ గురువారం బుల్దోజర్లతో ధ్వంసం చేసింది. కార్యాలయ భవనం పాక్షికంగా దెబ్బతిందని పాలస్తీనా మీడియా తెలిపింది. కార్యాలయం వెలుపలి గోడ ధ్వంసమైంది. తాత్కాలిక హాల్ మొత్తం నేలమట్టమైంది. పైకప్పు దెబ్బతింది. భవనం ప్రాంగణం మట్టి, శిథిలాలతో నిండిపోయిట్లు కనిపిస్తున్న వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసింది.
లెబనాన్‌లో 24 మంది మృతి
లెబనాన్‌లోని బీరుట్, బాల్బెక్–హెర్మెల్, దహియే ప్రాంతాలపై ఇజ్రాయెల్ ఆర్మీ శుక్రవారం జరిపిన దాడుల్లో 24 మంది చనిపోయారు. లెబనాన్–సిరియా సరిహద్దుల్లోని హెజ్‌బొల్లా ఆయుధ డిపోలు, స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ గురువారం భీకర దాడులకు పాల్పడింది. తమ యుద్ధ విమానాలు కుసాయిర్ నగరంలోని పలు లక్ష్యాలపై బాంబులు వేశాయని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
చదవండి : మీకు రిటర్న్ గిఫ్ట్ పక్కా
Comments
Please login to add a commentAdd a comment