పాత డ్యాంలతో ప్రపంచానికి ముప్పు  | Aging Water Infrastructure Give Report Old Dams Were Global Risk | Sakshi
Sakshi News home page

కాలం తీరుతున్న డ్యాంలతో ప్రపంచానికి ముప్పు

Published Mon, Feb 1 2021 11:28 AM | Last Updated on Mon, Feb 1 2021 11:37 AM

Aging Water Infrastructure Give Report Old Dams Were Global Risk - Sakshi

న్యూయార్క్‌: భవిష్యత్‌ తరాలకు జలప్రళయం పొంచి వుంది. కాలం తీరిన భారీ ఆనకట్టలతో రాబోయే మూడు దశాబ్దాల్లో ప్రజలు పెనుముప్పును ఎదుర్కోబోతున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. భారతదేశంలోని దాదాపు వెయ్యి డ్యాంలు నిర్మించి 2025 నాటికి 50 ఏళ్లు పూర్తవుతుంది. ప్రపంèచవ్యాప్తంగా ఇలా కాలం తీరిన డ్యాంలు అత్యంత ప్రమాదకరంగా మారుతాయని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. 2050 నాటికి.. అంటే మరో 30 ఏళ్లలో ఇటువంటి పురాతన ఆనకట్టలకు దిగువనే అత్యధిక మంది జీవిస్తూ ఉండే పరిస్థితి ఉంటుందని తెలియజేసింది.

ఐక్యరాజ్యసమితికి చెందిన  ‘కెనడా ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ వాటర్, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ హెల్త్‌’ సంకలనం చేసిన  ‘ఏజింగ్‌ వాటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌: ఎన్‌ ఎమర్జింగ్‌ గ్లోబల్‌ రిస్క్‌’ అనే నివేదిక ప్రపంచవ్యాప్తంగా 1930 నుంచి 1970  మధ్య నిర్మించిన 58,700 భారీ ఆనకట్టల జీవిత కాలాన్ని 50 నుంచి 100 ఏళ్లకే రూపకల్పన చేసిన ట్టు వెల్లడించింది. 50 ఏళ్ల తరువాత నుంచి ఇటువంటి భారీ ఆనకట్టల సామర్థ్యం క్షీణిస్తూ వస్తుంది.  

అమెరికాలో... 
అమెరికాలోని 90,580 డ్యాంల సరాసరి వయస్సు 56 ఏళ్ళు. 2020 సంవత్సరంలో అమరికాలోని  దాదాపు 85 శాతం ఆనకట్టలు వాటి జీవితకాలానికి మించి పనిచేస్తున్నాయి. 75 శాతం అమెరికా డ్యాంలు 50 ఏళ్ళు దాటిన తరువాత ఫెయిల్‌ అవడం ప్రారంభం అవుతుంది. అమెరికాలోని ఆనకట్టల పునరుద్ధరణకు 64 బిలియన్‌ డాలర్ల ఖర్చు అవుతుంది. 21 అమెరికా రాష్ట్రాల్లోని గత ముప్ఫయ్యేళ్ళలో దాదాపు 1,275 డ్యాంలను తొలగించారు. కేవలం 2017లోనే 80 డ్యాంలను తొలగించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రాజెక్టుల్లోని నీటి పరిమాణం 7,000 నుంచి 8,300 క్యూబిక్‌ కిలో మీటర్లు అని అంచనా వేశారు.  

ఆసియా, యూరప్, నార్త్‌ అమెరికాల్లో ప్రధానంగా 20వ శతాబ్దం మధ్య కాలంలో 1960– 70 దశకంలో అత్యధికంగా భారీ ఆనకట్టల నిర్మాణం జరిగింది. ఆఫ్రికాలో 1980ల్లో అత్యధికంగా డ్యాంల నిర్మాణం జరిగింది. ఆ తరువాత కాలంలో కొత్తగా భారీ ఆనకట్టల నిర్మాణం తగ్గుతూ వచ్చిందని ఈ అధ్యయనం తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 20 శతాబ్దం మధ్యలో మాదిరిగా ప్రపంచంలో తిరిగి పెద్ద ఆనకట్టల నిర్మాణం జరిగే అవకాశం ఇప్పుడు లేదు. కానీ ఆ రోజుల్లో నిర్మించిన ఆనకట్టలకు అనివార్యంగా వయస్సు పెరుగుతూ వస్తుంది. 

నాలుగు దశాబ్దాలుగా భారీ ఆనకట్టల నిర్మాణం తగ్గుతూ వస్తోంది. దీనికి కారణం ఈ భారీ ఆనకట్టల నిర్మాణానికి అవసరమైన ప్రాంతాలు సైతం క్రమంగా తగ్గిపోతున్నాయి. ఇప్పటికే 50 శాతం నదీప్రవాహ ప్రాంతం విఛ్చిన్నమైపోయినట్టు రిపోర్టు తెలిపింది. అలాగే భారీ డ్యాంల నిర్మాణాలు చూపుతోన్న ప్రభావం, పర్యావరణ సమస్యలు తదితర అంశాలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెరిగిందని కూడా ఈ అధ్యయనం గుర్తించింది. అందుకే భారీ ప్రాజెక్టుల స్థానంలో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నీటిని నిల్వచేసే దృక్పథం, దృష్టీ పెరిగింది. అందుకే  సహజ సిద్ధమైన పరిష్కారాలను వెతుకుతున్న విషయాన్ని ఈ అధ్యయనం తేల్చింది.

తీవ్రతరమవుతోన్న పర్యావరణ పరిస్థితుల రీత్యా ఆనకట్టల రూపకల్పనలో పరిమితులను పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. కాలంచెల్లిన ఆనకట్టలను తొలగించాల్సిన ఆవశ్యకతను ఈ రిపోర్టు స్పష్టం చేస్తోంది. ప్రజల భద్రత, నిర్వహణా ఖర్చులు తగ్గించేందుకు, రిజర్వాయర్ల సెడిమెంటేషన్, సహజసిద్ధమైన నదులను పరిరక్షించుకోవడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన భారీ ఆనకట్టల నిర్మాణం తగ్గడానికి ప్రధాన కారణాలని రిపోర్టు వెల్లడించింది. ఆనకట్టల నిర్మాణం ఎంత ముఖ్యమో, వాటి కాలం చెల్లిన తరువాత వాటి తొలగింపు కూడా  మానవాళి మనుగడకోసం అంతే ముఖ్యమని అధ్యయనం అభిప్రాయపడింది.

కాలం తీరడం అంటే..  
ఆనకట్ట నిర్మాణ సామర్థ్యాన్ని బట్టి అది ఎంతకాలం ఉంటుందో నిర్ధారిస్తారు. ఆనకట్ట నిర్మించి 50 ఏళ్లు దాటిన తరువాత దాని జీవిత కాలం క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఆనకట్టకి పదే పదే మరమ్మత్తుల అవసరం అవుతూ ఉంటాయి,  డ్యాం సామర్థ్యం క్షీణించడం వల్ల నిర్వహణ ఖర్చు పెరుగుతుంది. నాణ్యమైన ఆనకట్టలను రూపకల్పన చేస్తే, వాటి నిర్వహణ సమగ్రంగా ఉంటే, 100 సంవత్సరాల వరకూ చక్కగా ఉపయోగపడతాయి. కానీ, ఆర్థిక పరిమితులు, ఇతర ఆచరణాత్మక సమస్యల వల్ల వయస్సుమీరిన ఆనకట్టలు పనికిరాకుండా పోయే పరిస్థితి వస్తుంది. 20వ శతాబ్దంలో నిర్మించిన వేలకొద్దీ ఆనకట్టల దిగువన 2050 కల్లా అత్యధిక మంది ప్రజలు నివసించే పరిస్థితి ఏర్పడుతుంది. వాటిలో చాలా వరకు ఇప్పటికే కాలంతీరినట్టు ఐక్యరాజ్య సమితి యూనివర్సిటీ అంచనా వేసింది. అమెరికా, ఫ్రాన్స్, కెనడా, ఇండియా, జపాన్, జాంబియా, జింబాబ్వే దేశాల్లోని డ్యాంలపై ఈ అధ్యయనం చేశారు.

కేరళకు పెను ముప్పు
భారతదేశంలో దాదాపు 1,115 భారీ ఆనకట్టలు నిర్మాణం జరిగి 2025 నాటికి 50 ఏళ్లు పూర్తికానుంది. దేశంలోని దాదాపు 4,250కి పైగా ఆనకట్టలకు 2050 నాటికి 50 ఏళ్లు నిండుతాయి. అలాగే 2050 సంవత్సరానికల్లా దేశంలోని 64 ఆనకట్టలకు 150 ఏళ్ల పూర్తవుతాయి. 100 ఏళ్ల క్రితం నిర్మించిన కేరళలోని ముల్లపెరియార్‌ డ్యాం బద్దలైతే దాదాపు 35 లక్షల మంది ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఈ అధ్యయనం అంచనా వేసింది. దీన్ని భూకంపాలకు అనువైన ప్రదేశంలో కట్టారని, అలాగే కట్టడం క్రమంగా దెబ్బతింటోందని, ఈ డ్యాం పర్యవేక్షణ కేరళ తమిళనాడుల మధ్య వివాదాస్పదంగా మారిందని చెప్పింది.

అత్యధిక ఆనకట్టలు నాలుగు దేశాల్లోనే... 
20 శతాబ్దపు మధ్యలో ప్రపంచం అనూహ్యంగా భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చవి చూసిందని రిపోర్టు వెల్లడించింది. నాలుగు ఆసియా దేశాల్లోనే అత్యధికంగా భారీ డ్యాంలున్నాయని గుర్తుచేసింది. చైనా, ఇండియా, జపాన్, దక్షిణ కొరియాల్లో మొత్తం 32,716 పెద్ద ఆనకట్టలు(ప్రపంచంలోనే 55 శాతం) ఉన్నాయి. ఒక్క చైనాలోనే 23,841 భారీ ఆనకట్టలు(ప్రపంచంలోని మొత్తం డ్యాంలలో 40 శాతం) ఉన్నాయి. వీటిలో చాలా వాటికి త్వరలోనే 50 ఏళ్లు పూర్తవుతాయి. వీటికి ప్రమాదం పొంచి వున్నట్టు అధ్యయనంలో తేలింది. ఇదే పరిస్థితి ఆఫ్రికా, దక్షిణ అమెరికా, తూర్పు యూరప్‌లోనూ ఉంది. కాలంతీరిన పెద్ద ఆనకట్టల సమస్య చాలా తక్కువ దేశాలెదుర్కొంటున్నాయి. ప్రపంచంలోని పెద్ద ఆనకట్టలలో 93 శాతం కేవలం 25 దేశాల్లోనే ఉన్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా ఆనకట్టల స్థితిగతులు ఇలా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement