వాషింగ్టన్: గాల్లో ప్రయాణించే కారు.. ఈ వార్త కొత్తదేమీ కాకపోయినా ఇలాంటి వాహనం ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇతర కంపెనీల కంటే తామే ముందుగా ఎగిరే కారును మార్కెట్‌లోకి తీసుకురావాలని అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ మాటియోలో ఉన్న అలెఫ్ ఏరోనాటిక్స్ అనే సంస్థ తీవ్రంగా కృషి చేస్తోంది. మరో మూడేళ్లలోపే మార్కెట్‌లోకి తీసుకొస్తామని చెబుతోంది. గాలిలో ప్రయాణించే కారు తయారీలో అలెఫ్ ఏరోనాటిక్స్ ఇంజనీర్లు నిమగ్నమయ్యారు.
ఈ కారులో 8 ప్రొపెలర్స్, చుట్టూ జల్లెడ లాంటి బాడీ ఉంటుందని చెబుతున్నారు. ఇది నిలువుగా గాల్లోకి ఎగురుతుంది. నిర్దేశిత ఎత్తుకు చేరుకున్న తర్వాత 90 డిగ్రీలు మళ్లుతుంది. అనంతరం వేగంగా గాల్లో దూసుకెళ్తుంది. ఎగిరే కారు ధర 3 లక్షల డాలర్లు (రూ.2.47 కోట్లు) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రత్యేకంగా రన్‌వే అవసరం లేదని, సాధారణ రోడ్లపై కూడా ఈ కారును టేకాఫ్ చేయొచ్చని ఇంజనీర్లు వెల్లడించారు. గాలిలో గంటకు 260 మైళ్ల (418.429 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణిస్తుందని చెప్పారు. ఇది పూర్తిగా విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రిక్ కారు. 2025 నుంచి విక్రయాలు ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment