బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 20 మంది మృతిచెందారు. 100 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 80 కిలోమీటర్ల దూరంలోని ఖైరబ్ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. కిషోర్ గంజ్ రైల్వేస్టేషన్ దగ్గర గూడ్స్ రైలును ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా ఢీకొనటంతో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి.
ఢాకా వెళుతున్న గోథూళి ఎక్స్ ప్రెస్.. గూడ్స్ రైలును బలంగా ఢీకొన్నట్లు స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. కాగా ప్రమాద తీవ్రత అధికంగా ఉందని, మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని అధికారులు అంటున్నారు. ప్రమాదంలో కొన్ని బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయని, వాటిలో ప్రయాణికులు చిక్కుకుపోయారని, ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు అధికారులు.
ఈ ఘటన నేపధ్యంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా పలు రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గాయపడిన వంద మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద స్థలానికి అత్యవసర సర్వీసులు తరలివచ్చాయని, స్థానికుల సహకారంతో సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు బంగ్లాదేశ్ రైల్వే అధికారులు తెలిపారు. కాగా విచారణ అనంతరం ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలను వెల్లడించగలమని అధికారులు చెబుతున్నారు. రైలులో సురక్షితంగా ఉన్న ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు ప్రత్యేక వాహనాలలో తరలిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: హమాస్ చెర నుంచి మరో ఇద్దరు బందీల విడుదల!
Comments
Please login to add a commentAdd a comment