సాండ్రా మాసన్(ఫైల్)
శాన్‌జువాన్(పోర్టోరికో): కరేబియన్ ద్వీప దేశం బార్బడోస్ గణతంత్ర దేశం(రిపబ్లిక్)గా అవతరించింది. వలస పాలన తాలుకూ ఆనవాళ్లను చెరిపేసుకునే క్రమంలో మొట్టమొదటిసారిగా రిపబ్లిక్‌గా ప్రకటించుకుంది. దీంతో, దేశాధినేత హోదా నుంచి బ్రిటిష్ రాణి ఎలిజెబెత్–2ని తొలగించింది. దాదాపు 300 ఏళ్ల బ్రిటిష్ పాలన తర్వాత 1966లో బార్బడోస్‌కు స్వాతంత్య్రం వచ్చింది. రిపబ్లిక్‌గా ప్రకటించుకునే దిశగా బార్బడోస్ రెండు దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది.
గత నెలలో దేశానికి మొట్టమొదటి అధ్యక్షుడిని పార్లమెంట్ మూడింట రెండొంతుల మెజారిటీతో ఎన్నుకుంది. బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొంది 55 ఏళ్లవుతున్న సందర్భంగా బార్బడోస్ గవర్నర్ జనరల్ సాండ్రా మాసన్(72) మంగళవారం దేశాధినేతగా బాధ్యతలు స్వీకరించారు. పాలనా విషయాల్లో ఆమె ప్రధానమంత్రి మియా మోట్లేకు సహకరిస్తారు. దేశ రాజధాని బ్రిడ్జిటౌన్‌లో సోమవారం అట్టహాసంగా ప్రారంభమైన ఉత్సవాలకు ప్రిన్స్ చార్లెస్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
దేశమంతటా పండగ వాతావరణం నెలకొంది. 100 మందికి పైగా కళాకారులతో తీరప్రాంత రాజధాని నగరం బ్రిడ్జిటౌన్‌లో అంగరంగ వైభవంగా సంగీత కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. ఎలిజెబెత్–2ను రాణిగా గుర్తించకున్నా కామన్‌వెల్త్ కూటమిలో బార్బడోస్ కొనసాగనుంది. లండన్‌లోని ప్రీవీ కౌన్సిల్ బదులు ఇకపై ట్రినిడాడ్ కేంద్రంగా పనిచేసే కరీబియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌ను అత్యున్నత న్యాయస్థానంగా పరిగణించనుంది.
మూడు లక్షల జనాభా కలిగిన ఈ దేశ ప్రధాన ఆదాయవనరు పర్యాటక రంగం. సుమారు 3 లక్షల జనాభా ఉన్న బార్బడోస్‌లో అత్యధికులు బ్రిటిష్ పాలకులు చెరకు తోటల్లో పనిచేసేందుకు బానిసలుగా తీసుకువచ్చిన ఆఫ్రికా సంతతి వారే. కరీబియన్ దీవుల్లో భాగమైన గుయానా, డొమినికా, ట్రినిడాడ్ అండ్ టొబాగో 1970లలోనే రిపబ్లిక్‌లుగా మారినా బార్బడోస్ మాత్రం ఆ హోదా తాజాగా పొందింది.
Comments
Please login to add a commentAdd a comment