వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ రోజురోజుకు ఎక్కువవుతోంది. ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో ఇటీవల జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో బైడెన్ వెనుకబడ్డ విషయం తెలిసిందే. దీంతో సొంత పార్టీ డెమొక్రాట్లలోనే బైడెన్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ మొదలైంది.
ఈ క్రమంలో బైడెన్ తాజాగా మరోసారి తన వృద్ధాప్యాన్ని చాటుకున్నారు. వాషింగ్టన్‌లో తాజాగా జరిగిన మీడియా సమావేశంలో బైడెన్ పెద్ద పొరపాటే మాట్లాడారు. ఈసారి ఏకంగా వైస్ ప్రెసిడెంట్ కమలాహ్యారిస్, ప్రత్యర్థి ట్రంప్ పేరును కలిపేశారు.
వైస్ ప్రెసిడెంట్ ట్రంప్ అని అన్నారు ‘వైస్ ప్రెసిడెంట్ ట్రంప్‌కు అధ్యక్ష పదవి చేపట్టే అన్ని అర్హతలున్నాయి. అందుకే నేను ఆమెను వైస్ ప్రెసిడెంట్‌గా ఎంపిక చేశాను’అని కమలాహ్యారిస్ గురించి చెబుతూ ఆమె పేరుకు బదులు ట్రంప్ పేరు పలికారు.
దీంతో బైడెన్ మానసిక స్థితిపై మరోసారి చర్చ మొదలైంది. రిపబ్లికన్లు ఈ విషయమై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. బైడెన్ అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకోవాలన్న వాదనకు మరింత బలం చేకూరినట్లయింది. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment