కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియాను బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. ఏవియెన్ ఇన్‌ఫ్లూయెంజా అని పిలిచే ఈ వ్యాధి అక్కడి పక్షుల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కాలిఫోర్నియా కోళ్ల పరిశ్రమ ఏకంగా లాక్‌డౌన్ ప్రకటించే పరిస్థితి ఏర్పడింది. అడవి పక్షులకు ఈ వ్యాధి సోకుతుండటంతో అవి ఆకాశంలో ఎగురుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి.
అయితే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కేవలం పక్షులకేనా మనుషులకు, వారి పెంపుడు జంతువులకు కూడా వస్తుందా అనే విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మనుషులకు ఈ వైరస్ సోకే అవకాశాలు తక్కువే ఉన్నప్పటికీ పక్షులతో దగ్గరగా మెలిగే వారికి గతంలో ఈ వ్యాధి సోకిన సందర్భాలున్నాయి.
మనుషుల్లో హెచ్7ఎన్9,హెచ్5ఎన్1 వైరస్ రకాలు బర్డ్ ఫ్లూ వ్యాధికి కారణం అవుతాయి. సాధారణంగా పక్షుల లాలాజలం, వ్యర్థాల ద్వారా బర్డ్ ఫ్లూ వైరస్ బయటికి విడుదలవుతుంది. ఈ వైరస్ గాలిలో ఉన్నపుడు ఆ గాలిని మనుషులు పీల్చుకోవడం లేదా వైరస్ ఉన్న ప్రదేశాన్ని తాకి అవే చేతులతో కళ్లు, ముక్కు, నోరు తాకినపుడు వైరస్ మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తుంది.
బర్డ్ ఫ్లూ సోకిన కొందరిలో లక్షణాలు కనిపించకుండా కేవలం స్వల్ప అనారోగ్యం మాత్రమే ఉంటుంది. మరికొన్ని కేసుల్లో కళ్లు ఎరుపెక్కడం, జ్వరం, దగ్గు, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, తల నొప్పి, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి వ్యాధి తీవ్రంగా ఉంటే మరణం సంభవించే అవకాశం ఉంటుంది.
బర్డ్ ఫ్లూ సోకిన వారు లక్షణాలను గమనించి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రతను బట్టి హోమ్ లేదా హాస్పిటల్ ఐసోలేషన్‌లో ఉండాలి. శరీరంలో వైరస్ పూర్తిగా లేకుండా పోయిందని నిర్ధారించుకునేంత వరకు చికిత్స తీసుకుంటునే ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment