శ్రవణ కుమారుడు.. రామాయణంలో ఉదాత్తమైన పాత్ర. అంధ తల్లిదండ్రుల్ని కావడిలో మోస్తూ.. కంటికి రెప్పలా తన చివరిశ్వాసదాకా కాపాడుకున్న తనయుడు. పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల ఎంత అంకిత భావాన్ని కలిగి ఉండాలో చెప్పే ఒక మహోన్నత వ్యక్తిత్వం శ్రవణ కుమారుడిది. అలాంటి కొడుకులు ఈరోజుల్లో ఉంటారా? అంటే.. బ్రెజిల్‌లో ఓ యువకుడిని చూపిస్తున్నారు.
బ్రెజిలియన్ అమెజాన్ అడవుల గుండా ఓ వృద్ధుడిని భుజాన మోసుకుంటూ వెళ్తున్న ఒక తెగ యువకుడి ఫొటో సోషల్ మీడియాను కదిలిస్తోంది. ఆ కొడుకు పేరు తైవీ(24). భుజాన ఉంది అతని తండ్రి వాహూ. దట్టమైన అడవి.. ఆరు గంటల కాలినడకన గుట్టలు, వాగులు దాటి ప్రయాణించాడు. వ్యాక్సినేషన్ సెంటర్‌కు చేరుకుని.. తిరిగి మళ్లీ ఆరు గంటల ప్రయాణంతో ఇంటికి చేరుకున్నాడు. వ్యాక్సినేషన్ కోసం అలా తండ్రిని మోసుకుంటూ వెళ్లాడు. తండ్రికి చూపు సరిగా లేదు. పైగా అనారోగ్యం ఉంది. అందుకే అలా. ‘ఈరోజుల్లో ఇలాంటి కొడుకు ఉంటాడా?’ అనే అభిప్రాయమే ఎక్కువగా వ్యక్తం అవుతోంది.
డాక్టర్ ఎరిక్ జెన్నింగ్స్ సిమోయిస్ ఆ దృశ్యాన్ని క్లిక్‌మనిపించాడు. సాయం చేసేందుకు తాము ముందుకు వెళ్లినా.. వద్దని సున్నితంగా తిరస్కరించాడట తైవీ.
వాస్తవానికి ఈ ఫొటో కొత్తది కాదు. కిందటి ఏడాదిలో తీసింది. పైగా ఈ కథ విషాదాంతం కూడా అయ్యింది. ఈ తండ్రీకొడుకులు జోయ్ గిరిజన తెగకు చెందినవాళ్లు. తైవీ, అతని తండ్రి మొదటి డోస్‌వ్యాక్సినేషన్ కోసం వెళ్తుండగా తీసిన ఫొటో. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో వాహూ చనిపోయాడు. ఆయన మరణానికి కారణాలు తెలియవు. తైవీ ఆ కుటుంబానికి పెద్దగా మారాడు. ఈ మధ్యే మూడో వ్యాక్సిన్ డోస్ తీసుకున్నాడు కూడా.
బ్రెజిల్ పారా స్టేట్‌లో ఈ కమ్యూనిటీ పలు ప్రాంతాల్లో స్థిరపడింది. వాళ్లంతా ప్రపంచానికి దూరంగా నివసిస్తుండగా.. కరోనా మాత్రం వెంటాడుతోంది. అందుకే వ్యాక్సిన్ కోసం ఇలా సాహసోపేతంగా ప్రయాణిస్తున్నారు. బ్రెజిల్ వ్యాప్తంగా 853 మంది గిరిజనులు చనిపోయారు. కానీ, ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని తెగ పెద్దలు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment