బ్రెజీలియా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో మద్దతుదారులు ఆదివారం విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 3,000 మంది పార్లమెంటు, సుప్రీంకోర్టు, ప్రెసిడెంట్ ప్యాలెస్‌పై దాడి చేశారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది.
అయితే భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగింది. దీంతో బ్రెజీలియా గవర్నర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. మూడు నెలల పాటు అతన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దాడులపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది.
రాజధానిలో విధ్వంసం సృష్టించిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధ్యక్షుడు లూలా స్పష్టం చేశారు. బోల్సోనారోపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్రెజిల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అల్లరిమూకలు దేశ రాజధానిలో హింసకు పాల్పడ్డాయని విమర్శించారు.
రాజధానిలో భద్రతా వైఫల్యానికి బోల్సోనారోనే కారణమని లూలా ఆరోపించారు. ఫెడరల్ సెక్యూరిటీ జోక్యం చేసుకుని భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. విధ్వంసకారులను మతోన్మాద నాజీలు, మతోన్మాద స్టాలిన్లు, ఫాసిస్టులుగా అభివర్ణించారు. దాడులకు పాల్పడ్డవారిని న్యాయస్థానం ముందు నిలబెడతామని పేర్కొన్నారు.
గతేడాది జరిగిన ఎన్నికల్లో బోల్సోనారో పార్టీపై స్వల్ప సీట్ల తేడాతో గెలిచారు లూలా. అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. అయితే బోల్సోనారో ఈయన విజయంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన మద్దతుదారులు రెచ్చిపోయి రాజధానిలో బ్రెజీలియాలో ఆదివారం విధ్వంసం సృష్టించారు. ఈ అల్లర్లను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఖండించారు.
చదవండి: షాకింగ్.. విమానంలోకి పామును తీసుకెళ్లబోయిన మహిళ.. ఫొటో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment