న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపడంతో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో భారతదేశంపై ప్రశంసలు కురిపించాడు. రామాయణంలో హనుమంతుడు సంజీవని తీసుకొచ్చి లక్ష్మణుడిని కాపాడినట్టు తమ దేశాన్ని కాపాడినట్టుగా జైర్ బొల్సనారో భావించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ పంపినందుకు కృతజ్ఞతలు చెబుతూ హనుమంతుడు సంజీవని (వ్యాక్సిన్) తీసుకొస్తున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
‘ధన్యవాద్ భారత్ అంటూ… హనుమంతుడు సంజీవని (వ్యాక్సిన్) తీసుకువస్తున్న ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. ‘నమస్కార్ ప్రైమ్ మినిష్టర్ మోదీజీ ! కోవిడ్ పై పోరులో మేం చేస్తున్న పోరుకు మీరు కూడా సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు.. ఇది మాకు గర్వకారణం కూడా’ అని తెలిపారు. అతడి ట్వీట్‌కు ప్రధాని మోదీ స్పందించారు. ‘కరోనా వైరస్ మీద మనం కలిసికట్టుగా చేస్తున్న పోరాటానికి మా సహకారం ఎప్పటికీ ఉంటుంది’ అని స్పష్టం చేశారు. ఆరోగ్య రంగంలో ఉభయ దేశాలూ సహకరించుకోవలసిందే అని గుర్తుచేశారు.
భారత్‌లో తయారైన వ్యాక్సిన్‌ను సరిపడా నిల్వలు ఉంచుకుని మిత్ర దేశాలకు భారత్ ఎగుమతి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం బ్రెజిల్‌కి రెండు మిలియన్ల కోవీషీల్డ్ టీకామందు సరఫరా చేశారు. అత్యవసరంగా కోవిడ్ వ్యాక్సిన్ కావాలని బ్రెజిల్ చేసిన విజ్ఞప్తికి భారత్ స్పందించి పంపించింది. అయితే కరోనా ప్రారంభ దశలో బ్రెజిల్‌కు మనదేశం హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment