ఒట్టావా: భారత్, పాకిస్తాన్‌ల నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలపై నిషేధాన్ని నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 21 వరకూ ఈ నిషేధం కొనసాగుతుందని, అప్పటి వరకూ భారత్, పాక్‌ల నుంచి డైరెక్టు విమానాలు ఉండవంది. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగానే నిషేధం పొడిగించినట్లు పేర్కొంది.
అయితే ఈ ఇరు దేశాల ప్రజలు ఏదైనా మూడో దేశం మీదుగా తమ దేశంలోకి చేరుకోవడానికి మాత్రం అనుమతి ఇచ్చింది. ఇందుకుగానూ కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. అత్యవసర వస్తువులు, వ్యాక్సిన్లు, ఇతర మెడికల్ సంబంధమైన వాటిని రవాణా చేసేందుకుగానూ కార్గో ఫ్లైట్లు తిరుగుతాయని స్పష్టం చేసింది. ప్రజల ప్రాణాలను కాపాడటం ప్రభుత్వం బాధ్యత అని అందుకే నిషేధం పొడిగించినట్లు ఆ దేశ రవాణా శాఖ మంత్రి ఒమర్ అల్‌ఘాబ్రా చెప్పారు. వాస్తవానికి ఏప్రిల్ 22న విధించిన 30 రోజుల నిషేధం ఈ నెల 22తో ముగియనున్న నేపథ్యంలో కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment