మాంట్రియల్: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారంలో భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో.. ఒక్కసారిగా స్వరం మార్చారు. భారత్‌తో సత్సంబంధాల విషయంలో కెనడా కట్టుబడి ఉందని.. ఆ విషయంలో వెనక్కి తగ్గబోదంటూ వ్యాఖ్యానించారాయన.
గురువారం మాంట్రియల్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘గ్లోబల్ స్థాయిలో భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత చూస్తున్నాం. ఇలాంటి టైంలో కెనడా, దాని మిత్రపక్షాలు భారత్‌తో సంబంధాలు మరింత మెరుగుపర్చుకోవాలనే తీవ్రంగా ప్రయత్నిస్తాయి’’ అని వ్యాఖ్యానించారాయన. భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి. భౌగోళిక రాజకీయంలో కీలక పాత్ర పోషిస్తోంది. కిందటి ఏడాది మేం(కెనడా) ఇండో-పసిఫిక్ వ్యూహాన్ని అందించాం. తమ దేశం ఇప్పటికీ భారత్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పర్చుకోవడానికి కట్టుబడి ఉంది అని తెలిపారు.
అమెరికా మాతోనే..
అయితే అదే సమావేశంలో ఆయన కాసేపటికి మళ్లీ పాతపాటే పాడారు. నిజ్జర్ హత్యోదంతాన్ని మళ్లీ హైలైట్ చేశారు. నిజ్జర్ హత్యను ప్రజాస్వామ్యం, చట్టాలను అనుసరించే దేశాలు తీవ్రంగా పరిగణించాలని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మరోవైపు నిజ్జర్ హత్యపై అమెరికన్లు తమతోనే ఉన్నారని ప్రకటించారు. భారత్ విదేశాంగ మంత్రితో భేటీ సమయంలో ఈవిషయాన్ని లేవనెత్తుతానని అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాటిచ్చారని ట్రూడో వెల్లడించారు. నిజ్జర్ హత్యను ప్రజాస్వామ్య దేశాలు సీరియస్‌గా తీసుకోవాలని ట్రూడో పిలుపు ఇచ్చారు.
‘‘కెనడా, దాని మిత్రదేశాలు భారత్‌తో కలిసి నిర్మాణాత్మకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ, అదే సమయంలో చట్టాలను అనుసరించే దేశంగా.. నిజ్జర్ హత్య విషయంలో మాతో కలిసి భారత్ పనిచేసి వాస్తవాలను వెలికితీయాలి. కెనడియన్‌కు మా గడ్డపై హత్య చేయడంలో భారత ఏజెంట్ల పాత్ర నిర్ధారించే విషయంలో అమెరికా మాతోనే ఉంది’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment