బీజింగ్: చైనాలో దాదాపు ఆరు నెలల తర్వాత తొలి కరోనా మరణం సంభవించింది. ఆ దేశ ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు 'జీరో కోవిడ్ పాలసీ' పేరిట కఠిన ఆంక్షలను ఇంకా కొనసాగిస్తూనే ఉంది డ్రాగన్ దేశం.
ఇప్పుడు మరణించిన వ్యక్తి బీజింగ్‌కు చెందిన వృద్ధుడు అని అధికారులు తెలిపారు. వయసు 87 ఏళ్లు అని పేర్కొన్నారు. ఈయన మృతితో చైనాలో కోవిడ్ మరణాల సంఖ్య 5,227కు చేరింది. చివరిసారిగా మే 26న షాంగైలో కరోనా మరణం నమోదైంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే మరో వ్యక్తి వైరస్ కారణంగా చనిపోయాడు.
చైనాలో దాదాపు 92 శాతం మంది కనీసం ఒక్కడోసు కరోనా టీకా తీసుకున్నారు. అయితే వృద్ధులకు టీకాలు సరిగా పంపిణీ చేయలేదని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరణించిన వ్యక్తి కూడా టీకా తీసుకున్నాడా? లేదా? అనే విషయంపై ఆరోగ్య శాఖ స్పష్టత ఇవ్వలేదు.
కరోనా కట్టడికి ప్రపంచంలో ఏ దేశమూ అమలు చేయని విధంగా జీరో కోవిడ్ పాలసీని అమలు చేస్తోంది చైనా. కేసులు నమోదైన ప్రాంతాల్లో లాక్‌డౌన్ సహా కఠిన ఆంక్షలు విధిస్తోంది. వ్యాపారం, ఆర్థికవ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతున్నప్పటికీ ఆంక్షల విషయంలో మాత్రం రాజీ పడటం లేదు. చైనాలో ఇప్పటివరకు 2,86,197 కరోనా కేసులు వెలుగుచూశాయి. వైరస్ బారినపడిన వారిలో 2,60,141 మంది కోలుకున్నారు.
చదవండి: ఉక్రెయిన్‌కి సాయం అందిస్తాం: రిషి సునాక్
Comments
Please login to add a commentAdd a comment