బీజింగ్: జన సంఖ్య పరంగా ప్రపంచంలోనే తొలిస్థానంలో ఉన్న చైనా.. ప‍్రస్తుతం జనాభా సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. కొన్నేళ్లుగా చేపట్టిన కట్టడి చర్యలు, ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన ఆంక్షలు, ఆర్థిక పరిస్థితుల కారణంగా చాలా మంది యువత పెళ్లి, సంతానానికి దూరంగా ఉండిపోవటమే అందుకు కారణంగా చెప్పవచ్చు.
ఈ అంశం దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆందోళన చెందుతోంది డ్రాగన్ దేశం. జనాభా వృద్ధి, శ్రామిక శక్తిని పెంచేందుకు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ.. భారీ ప్రోత్సాహకాలు ఇస్తోంది. అందులో పన్నుల రాయితీ, ఇంటి రుణాలు, విద్యా ప్రయోజనాలతో పాటు నగదు రూపంలోనూ ప్రోత్సాహకాలు ఉన్నాయి.
చైనాలోని జనాభాపై 2022, జనవరిలో గ్లోబల్ టైమ్స్ విడుదల చేసిన ఓ నివేదిక విస్తుపోయే విషయాలను వెల్లడించింది. 2021 చివరి నాటికి చైనాలో 1.413 బిలియన్ల జనాభా ఉండగా.. జననాల సంఖ్య 10.62 మిలియన్లకు పడిపోయింది. అది మరణాల సంఖ్యకు సమానంగా ఉండటం గమనార్హం. ఈశాన్య నగరమైన వూహూలో జననాల రేటు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు పేర్కొంది. ఇలాగే జననాల రేటు పడిపోతే.. యువకుల సంఖ్య తగ్గిపోయి కొన్నేళ్లలోనే శ్రామిక శక్తి సైతం వేగంగా పడిపోనుంది.
జనాభా సంక్షోభానికి కారణమిదే..
పెరుగుతున్న జనాభాను కట్టడి చేసేందుకంటూ.. గతంలో ఒకే బిడ్డ పాలసీని అమలులోకి తీసుకొచ్చింది చైనా కమ్యూనిస్ట్ పార్టీ. దశాబ్దాలుగా బలవంతంగా అబార్షన్లు చేయించి మహిళల హక్కులను కాలరాసింది. దాంతో పిల్లల్ని కనేందుకు చాలా మంది వెనకడుగు వేయాల్సి వచ్చింది. కొన్నేళ్లలోనే అది జనాభా సంక్షోభానికి దారి తీసింది. ఈ సమస్యను గుర్తించిన చైనా.. ప్రస్తుతం ఇద్దరు, లేదా ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతిస్తోంది. అంతే కాదు మహిళలకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది.
ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు మహిళలకు.. పన్ను రాయితీలు, ఇంటి రుణాలు, విద్యా ప్రయోజనాలు, నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అయితే, ఈ ప్రోత్సాహకాలు వివాహం జరిగిన దంపతులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది.
ఒకే బిడ్డ ఉన్న తల్లిదండ్రులు ప్రస్తుతం సామాజిక ప్రయోజనాలైన ఆరోగ్య బీమా, విద్య వంటివి పొందలేకపోతున్నారని తెలిపింది. మరోవైపు.. ఇప్పటికీ మైనారిటీలు, ఒంటరి మహిళలపై చైనా వివక్ష చూపుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నాయి.
కొత్త పాలసీపైనా వ్యతిరేకత..
ఆ దేశంలో మహిళలు విద్య, ఆర్థిక పరంగా అభివృద్ధి సాధిస్తున్నా.. వివాహం విషయంలో పురుషులతో పోలిస్తే వెనకబడే ఉన్నారు. గత ఏడాది కొత్త జనాభా, కుటుంబ నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చింది బీజింగ్. దంపతులు ముగ్గురు పిల్లలను కలిగి ఉండేందుకు అనుమతించింది. అయితే.. ఆర్థిక భారం వల్ల ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండటం పట్ల అక్కడి ప్రజలు విముఖత ప్రదర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment