Cats being killed and sold as mutton or pork in china డ్రాగన్ కంట్రీ చైనాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మటన్ పేరుతో పిల్లుల మాంసాన్ని విక్రయిస్తున్న వైనం కలకలం రేపింది. దేశంలో జంతురక్షణ చట్టాలు,ఆహార భద్రత మరోసారి చర్చకు దారి తీసింది.
దాదాపు 1,000 పిల్లులను కబేళాకు తరలిస్తుండగా చైనా పోలీసులు పట్టుకున్నారు. దీంతో పిల్లి మాంసాన్ని పంది మాంసం లేదా మటన్‌గా విక్రయించే అక్రమ వ్యాపారం గుట్టు రట్టయింది. ఈ నెల ప్రారంభంలో జంతు పరిరక్షణ కార్యకర్తల సూచన మేరకు, తూర్పు చైనీస్ ప్రావిన్స్ జియాంగ్సులోని జాంగ్జియాగాంగ్ అధికారులు దాడులు నిర్వహించారని ది పేపర్ నివేదించింది. పిల్లుల మాంసాన్ని మటన్ గా నమ్మించి దేశంలోని దక్షిణ ప్రాంతానికి సరఫరా చేస్తున్నారని తెలిపింది. దక్షిణ చైనా ప్రావిన్స్‌లోని గ్వాంగ్‌డాంగ్‌లో ఇంతకుముందు ఇలాంటి అక్రమ వ్యాపారాలను నిలిపివేసినట్లు జంతు సంరక్షణ ఉద్యమకర్త హాన్ జియాలీ చెప్పారు. చైనాలో ఒక్కో క్యాటీ (600 గ్రాములు) పిల్లి మాంసం ధర 4.5 యువాన్లు పలుకుతోందట.
జాంగ్‌జియాగాంగ్ నగరంలోని కబేళాలో భారీ ఎత్తున పిల్లులను వేలాడదీసి ఉండటంతో అనుమానం వచ్చిన యానిమల్ రైట్స్ ప్రొటెక్షన్ కార్యకర్తలు నిఘా వేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఒక ట్రక్కులో అక్రమంగా రవాణా చేస్తుండగా ఈ పిల్లులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీటిని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. తాజా ఘటనతో చైనీయులలో ఆహార భద్రత పై ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. సోషల్ మీడియా సంస్థ వీబోలో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇది తిన్న మనుషులకు భయంకరమైన చావు తప్పదని ఒకరు వ్యాఖ్యానించగా, ఈ దేశంలో పిల్లులకు, కుక్కలకు జీవించే హక్కు లేదా అని మరొకరు ప్రశ్నించారు. అంతేకాదు చచ్చినా ఇకపై బార్బెక్యూ మాంసం తినను అని మరొక యూజర్ కమెంట్ చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment