కీవ్/బీజింగ్: ఏడాది కాలంపాటు జరిగిన విధ్వంసకాండ.. నరమేధం తర్వాత ఉక్రెయిన్ యుద్దం ముగింపు దశకు చేరుకోబోతోందా?.. అదీ వీలైనంత తర్వలోనేనా?. దురాక్రమణను నిలిపేసి.. బలగాలను వెనక్కి రప్పించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరిస్తారా?.. ఒక బాధిత దేశంగా శాంతి చర్చలకు తామే తొలి అడుగు వేస్తామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించిన వేళ.. చైనా చేస్తున్న ప్రయత్నాలపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ మొదలైంది.
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను మొదటి నుంచి చైనా వ్యతిరేకించడం లేదు. అలాగని సమర్థించడమూ లేదు. కానీ, ఉన్నపళంగా శాంతి చర్చల రాగం అందుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు శుక్రవారం.. ఇరుదేశాలు సమన్వయం పాటించాలని సూచిస్తూ పొలిటికల్ సెటిల్మెంట్ పేరుతో 12 పాయింట్ల పేపర్‌ను విడుదల చేసింది చైనా ప్రభుత్వం. ఆ వెంటనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ సైతం.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో భేటీకి సిద్ధమంటూ ప్రకటించారు. వెనువెంటనే.. రష్యా సైతం చైనా శాంతి చర్చల పిలుపును స్వాగతించింది కూడా!.
చైనా శాంతి ప్రణాళిక నేపథ్యంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను కలవనున్నట్లు ప్రకటించారు. జింగ్‌పిన్‌ను కలిసి చర్చించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపిన ఆయన.. ఇది ప్రపంచ భద్రతకు సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారించాలంటే రష్యాకు చైనా నుంచి ఆయుధాలు సరఫరా కాకుండా చూస్కోవడమే ఇప్పుడు తన ముందున్న కర్తవ్యమని, చైనా కూడా ఈ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారాయన. మరోవైపు.. జెలెన్‌స్కీ-జిన్‌పింగ్ భేటీ ఎప్పుడన్నదానిపై స్పష్టత లేకున్నా.. ఈ పరిణామంపై రష్యా కూడా స్పందించింది. రష్యా విదేశాంగ ఒక ప్రకటనలో.. చైనా శాంతి ప్రయత్నాలను అభినందించింది. బీజింగ్ అభిప్రాయాలను మేం గౌరవిస్తాం అంటూ అందులో స్పష్టం చేసింది రష్యా విదేశాంగ శాఖ. ఈ తరుణంలో శాంతి చర్చలకు బీజింగ్ వేదిక కాబోతోందని, త్వరలోనే యుద్ధానికి పుల్‌స్టాప్ పడొచ్చని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు విశ్లేషణాత్మక ప్రత్యేక కథనాలు ప్రచురిస్తున్నాయి.
పుతిన్ వార్నింగ్‌ను తప్పుబట్టిన చైనా!
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఫిబ్రవరి 24వ తేదీతో.. సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. ఒకవైపు ఉక్రెయిన్ భారీగా నష్టపోయింది. రష్యా సైతం భారీగా బలగాల్ని కోల్పోయింది. అయినప్పటికీ రష్యా మాత్రం ‘తగ్గేదేలే..’ అనుకుంటూ రెండో ఏడాదిలోకి అడుగుపెట్టేసింది. అసలు యుద్ధానికి ముగింపు ఎప్పుడు? అనేదానిపై ఎవరూ అంచనా వేయలేని స్థితి. ఈ తరుణంలో.. బుధవారం మాస్కోలోని చైనా దౌత్యవేత్త వాంగ్ యూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ను కలిశాడు. ఆ తర్వాత చైనా నుంచి శుక్రవారం శాంతి ప్రణాళిక బయటకు రావడం గమనార్హం.
చైనా ఇరు దేశాలకు శుక్రవారం కీలక సూచన చేసింది. రెండు దేశాలు సంయమనం పాటించాలి. తక్షణ శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి అని చైనా తన శాంతి ప్రకటనలో సూచించింది. పొలిటికల్ సెటిల్మెంట్‌లో.. ఉక్రెయిన్-రష్యాలు ముఖాముఖి చర్చలకు ప్రయత్నించాలని చైనా, యావత్ ప్రపంచాన్ని కోరింది. పుతిన్ అణ్వాయుధాల ప్రయోగం హెచ్చరికల నేపథ్యంలో.. అణ్యాయుధాలను వాడడమే కాదు, వాటిని యుద్ధ క్షేత్రంలో మోహరించడం కూడా పెను విపత్తేనని పుతిన్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. అంతర్జాతీయ మానవతా చట్టానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండాలని సూచించింది. పౌరులు/ పౌర సౌకర్యాలపై దాడులు చేయకూడదని చెప్పింది. అత్యవసరంగా శాంతి చర్చలకు ముందుకు రావాలని అందులో పేర్కొంది చైనా.
చైనా వెరీ డేంజర్: వెస్ట్రన్ కంట్రీస్
ఇదిలా ఉంటే.. చైనా చేసిన శాంతి ప్రతిపాదలను ఉక్రెయిన్‌కు మద్ధతు ఇస్తున్న పాశ్చాత్య దేశాల్లో చాలావరకు తిరస్కరించాయి. పైగా మాస్కోతో బీజింగ్‌కు ఉండే సన్నిహిత సంబంధాల దృష్ట్యా.. జాగ్రత్తగా ఉండాలని ఉక్రెయిన్‌ను, జెలెన్‌స్కీని హెచ్చరించాయి. ‘‘రష్యా.. చైనాకు వ్యూహాత్మక మిత్రదేశం. అలాంటి దేశంలో సన్నిహితంగా ఉంటూనే.. దురాక్రమణ విషయంలో తటస్థంగా ఉంటూ వస్తోంది. ఇది ఉక్రెయిన్ గమనించాలి. ఇదేకాదు.. 12 పాయిట్ల పొలిటికల్ సెటిల్మెంట్‌లో.. ఎక్కడా కూడా రష్యా బలగాలు ఉక్రెయిన్ గడ్డ నుంచి వెనక్కి వెళ్లిపోవాలని చైనా చెప్పలేదు. పైగా రష్యాపై సానుకూల ధోరణి ప్రదర్శిస్తూ.. ‘‘ఏకపక్ష ఆంక్షల’’ను తీవ్రంగా ఖండించింది కూడా’’ అని పాశ్చాత్య దేశాలు చెప్తున్నాయి.
ఇక చైనా శాంతి చర్చల పిలుపుపై నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ స్పందించారు. బీజింగ్‌ను నమ్మడానికి వీల్లేదని, ఎందుకంటే అది ఉక్రెయిన్‌పై దురాక్రమణను ఏనాడూ ఖండించలేదని తెలిపారు. మరోవైపు రష్యాకు బీజింగ్ నుంచి ఆయుధాల సరఫరా జరుగుతోందని అమెరికా ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. బీజింగ్ ఆ ఆరోపణను ఖండించింది.
Comments
Please login to add a commentAdd a comment