పుతిన్‌కు యుద్దమే ఇష్టం.. ట్రంప్‌ ప్లాన్‌ కష్టమే: జెలెన్‌స్కీ | Ukraine Volodymyr Zelenskyy Allegations On Russia Putin | Sakshi
Sakshi News home page

పుతిన్‌కు యుద్దమే ఇష్టం.. ట్రంప్‌ ప్లాన్‌ కష్టమే: జెలెన్‌స్కీ

Published Fri, Mar 14 2025 7:41 AM | Last Updated on Fri, Mar 14 2025 8:04 AM

Ukraine Volodymyr Zelenskyy Allegations On Russia Putin

కీవ్‌: ఉక్రెయిన్‌-రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై కసరత్తు జరుగుతున్న వేళ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం తిరస్కరణకు పుతిన్‌ సన్నద్ధమవుతున్నారని జెలెన్‌స్కీ అన్నారు. అలాగ, ఉక్రెయిన్‌ ప్రజలనే చంపాలన్నదే పుతిన్‌ లక్ష్యం అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించడానికి కారణాలు వెతుకుతున్నారు. కాల్పుల విరమణను ఆలస్యం చేయడానికి, అమలుకాకుండా ఉండేందుకు పుతిన్‌ సన్నద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే కాల్పుల విరమణ ఒప్పందానికి పుతిన్‌ కండీషన్స్‌ పెడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కారణంగా ఈ విషయం నేరుగా చెప్పడానికి భయపడుతున్నారు.  ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తూ మా దేశ ప్రజలు చంపాలన్నదే పుతిన్‌ లక్ష్యం. అందుకే కాల్పుల విరమణ ఒప్పందం అంగీకరించకుండా సాకులు వెతుకుతున్నారు.

షరతులు లేని కాల్పుల విరమణ కోసం అమెరికా ప్రతిపాదన చేసింది. ఉక్రెయిన్‌ ఈ ప్రతిపాదనను అంగీకరించింది. దీనిపై పర్యవేక్షణ ధృవీకరణను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు అమెరికా కూడా తెలిపింది. ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. కాల్పుల విరమణ సమయంలో, దీర్ఘకాలిక భద్రత, శాశ్వత శాంతి గురించి అన్ని ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయడం, యుద్ధాన్ని ముగించడానికి ఒక ప్రణాళికను సిద్ధంగా ఉంచాం. ఉక్రెయిన్ వీలైనంత త్వరగా నిర్మాణాత్మకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మేము దీని గురించి అమెరికా ప్రతినిధులతో కూడా మేము చర్చించాం. ఉక్రెయిన్‌తో యూరోపియన్ భాగస్వాములు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మిత్రదేశాలకు దీని గురించి తెలుసు.

ఈ ప్రక్రియను క్లిష్టతరం చేసే పరిస్థితులను మేము ఏర్పాటు చేయడం లేదు. రష్యా కారణంగానే కాల్పుల విరమణ ఒప్పందం ఆలస్యమవుతోంది. పుతిన్ సంవత్సరాల తరబడి శాంతి లేకుండా యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు అతనిపై ఒత్తిడి పెంచాల్సిన సమయం ఆసన్నమైంది. పుతిన్‌పై ఆంక్షలు విధించాలి. ఈ యుద్ధాన్ని ముగించమని రష్యాను బలవంతం చేయడానికి మేము ప్రతీ ఒక్కరితో కలిసి పని చేస్తూనే ఉంటాము. అని చెప్పుకొచ్చారు. 

మరోవైపు.. కాల్పుల విరమణ ప్రతిపాదనపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తాజాగా స్పందించారు. మాస్కోలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో పుతిన్‌ మాట్లాడుతూ.. ట్రంప్‌ ఆలోచన సరైందే. కచ్చితంగా మేం మద్దతిస్తాం. అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని మా అమెరికా మిత్రులతో ఇతర భాగస్వాములతో చర్చిస్తాం. ఒప్పందం ఉల్లంఘన కాకుండా.. సరైన యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. యుద్ధం ఆపాలన్న ప్రతిపాదనకు మేం అంగీకరిస్తున్నాం. అయితే కాల్పుల విరమణ.. శాశ్వత శాంతి దిశగా సాగుతుందన్న ఆశాభావంతో అందరం ముందుకు వెళ్లాలి. సమస్య మూలాలను తొలగించాలి’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్న ట్రంప్‌నకు పుతిన్‌ ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. భారత్, చైనా, దక్షిణాఫ్రికా నేతలకూ కృతజ్ఞతలు చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందంలో ఈ మూడు దేశాలు కూడా కీలక పాత్ర పోషించాయని పుతిన్‌ సంకేతం ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement