
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), ఇలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగానికి న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలింది. ఉద్యోగాల్లోంచి తీసేసిన వేల మంది ఫెడరల్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కాలిఫోర్నియా ఫెడరల్ న్యాయమూర్తి విలియమ్స్ అల్‌సప్ ఆదేశాలు జారీ చేశారు.
మొత్తం ఆరు ఫెడరల్ ఏజెన్సీల నుంచి తొలగించిన ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారాయన. ఉద్యోగాల్లో ప్రదర్శన ఏం బాగోలేదని చెబుతూ.. ఇలాన్ మస్క్(Elon Musk) నేతృత్వంలోని డోజ్ విభాగం వేల మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా బూటక చర్యగా అభిప్రాయపడ్డ జడ్జి విలియమ్స్ అల్‌సప్(William Alsup).. వెంటనే వాళ్లను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆదేశించారు.
చట్టానికి విరుద్ధంగా ఉద్యోగులను తొలగించారంటూ.. ఓపీఎం(Office of Personnel Management) ఆదేశాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో పాటు మరికొందరు కోర్టును ఆశ్రయించారు. అయితే OPM చర్యలు కేవలం మార్గదర్శకత్వం మాత్రమేనని, అత్యవసర సిబ్బందిని తొలగించలేదని న్యాయశాఖ వాదనలు వినిపించింది. ఈ వాదనను ఏకీభవించని జడ్జి విలియమ్స్ అల్‌సప్.. ఆ ఆదేశాలను నిలుపుదల చేస్తూ తక్షణమే ఆ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు.
సైన్య వ్యవహారాలు, వ్యవసాయం, రక్షణ, ఖజానా శాఖ.. ఇలా మొత్తం ఆరు శాఖల ఉద్యోగాలను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారాయన. అయితే ఈ ఆదేశాలు అన్ని ఫెడరల్ ఏజెన్సీలకు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఉద్యోగాల తొలగింపు తననూ బాధించిందని.. కానీ వాళ్లలో చాలామంది పని చేయలేకపోయారని.. అందుకే ఉత్తమ ప్రదర్శన ఉన్నవాళ్లను మాత్రమే కొనసాగిస్తున్నామని ట్రంప్ బుధవారం వ్యాఖ్యలు చేశారు. ఆ మరుసటి రోజే కాలిఫోర్నియా జడ్జి ఈ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. అయితే ట్రంప్ సర్కార్ ఈ ఆదేశాలను సవాల్ చేసే అవకాశం లేకపోలేదు.
ఎవరీ జడ్జి?
79 ఏళ్ల విలియమ్స్ అల్సప్ సీనియర్ న్యాయమూర్తి. హార్వార్డ్ నుంచి న్యాయవిద్య పూర్తి చేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి విలియమ్ డగ్లస్‌కు 1971-72 మధ్య క్లర్క్‌గా పని చేశారు. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో కరోలినా నార్త్ డిస్ట్రిక్ జడ్జిగా నియమించబడ్డారు. 2021 జనవరిలో సీనియర్ హోదా దక్కింది ఆయనకు.
డోజ్ విమర్శలపై మస్క్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(DOGE) సారథిగా నియమించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే ‘డోజ్’ ప్రాజెక్టు లక్ష్యమని, తన ప్రభుత్వంలో సమర్థత పెంచేందుకు ఈ విభాగం కృషి చేస్తుందని ఆ టైంలో ట్రంప్ ప్రకటించారు.
ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులకు కత్తెర, దుబారా ఖర్చులకు కోత, అవినీతి నిర్మూలన, ఫెడరల్ సంస్థలను పునర్మిర్మాణం.. ఇలా డోజ్‌కి లక్ష్యాలను ఇచ్చారు. ఇందులో భాగంగా.. ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు చేపట్టారు. ఈ క్రమంలోనే గత రెండు నెలల కాలంలోనే 62,530 మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగించారు. అయితే నాసా, విద్యా శాఖ, సైన్య విభాగాలపై ఈ తొలగింపులు ప్రభావం చూపించాయి. ఈ తొలగింపులు ఇలాగే కొనసాగితే.. నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరుగుతుందని.. ఈ ఏడాది చివరికల్లా ఆ సంఖ్య ఐదు లక్షలకు చేరుకునే అవకాశం ఉంటుందని అక్కడి ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment