జోహన్నెస్‌బర్గ్: గాల్లో ఎగురుతున్న ఓ విమానంలోని అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాక్ పిట్‌లోకి ప్రవేశించిన అత్యంత విషపూరితమైన కేప్ కోబ్రా ఏకంగా పైలట్ సీట్ పక్కన దర్శనమిచ్చింది. పామును గమనించిన పైలట్ భయపడకుండా చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో సోమవారం చోటు చేసుకుంది. విమానంలో పామును చూసిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.
సోమవారం నలుగురు ప్రయాణికుతో చిన్న విమానం వార్సెస్టర్ నుంచి నెల్సుప్రీట్‌కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ రుడోల్ఫ్ ఎరాస్‌మస్‌కు తన వెనుక భాగంలో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. తల తిప్పి చూడగా.. ఓ నాగుపాము తన సీటు కింద కదులుతూ కనిపించింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.
అయితే పాముని చూసి బెంబేలెత్తకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. ఈ విషయాన్ని ముందుగా గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందికి తెలియజేశాడు. ఏటీసీ సూచనలతో విమానాన్ని జోహన్నెస్‌బర్గ్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో ప్రాయణికులకు ప్రాణాపాయం తప్పింది. విమానంలోని వారిని దింపేసి తనిఖీలు చేయగా.. పైలట్ సీటు కింద పాము చుట్టుకొని ఉండటాన్ని గుర్తించారు.
వాస్తవానికి ప్రయాణానికి ముందు రోజు ఆదివారం మధ్యాహ్నం వార్సెస్టర్ ఎయిర్‌పోర్టు సిబ్బంది విమానం రెక్కల కింద నాగుపామును గుర్తించారు. దాన్ని పట్టుకునేందుకు వారు ప్రయత్నించినా దాని ఆచూకీ లభించకపోవడంతో బయటకు వెళ్లిపోయిందని భావించారు. అనూహ్యంగా మర్నాడు కాక్‌పిట్‌లో ప్రత్యక్షమైంది. మరోవైపు సంయమనం పాటించి, విమానాన్ని జాగ్రత్తగా ల్యాండింగ్ చేసిన పైలెట్‌ను అభినందిస్తూ అతని ధైర్య సాహసాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment