జెరూసలేం:దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో మూడువారాల లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. రెండవసారి వైరస్ సంక్రమణను అడ్డుకునేందుకు ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రపంచంలోనే ఇలాంటి చర్య తీసుకున్న మొదటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఇజ్రాయెల్ నిలిచింది. మూడు వారాల పాటు కఠినమైన లాక్‌డౌన్ కు కేబినెట్ అంగీకరించిందని, దీనిని పొడిగించే అవకాశం కూడా ఉందని దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం ప్రకటించారు. రోజుకు 4వేలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయనీ దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మహమ్మారి కారణంగా ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థపై రెండవ లాక్‌డౌన్ ద్వారా 6.5 బిలియన్ల షెకెల్లు (1.88 బిలియన్ డాలర్లు) మేర నష్టం ఏర్పడనుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా.
దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుతుండడంతో సెప్టెంబర్ 18నుంచి రెండు వారాల లాక్‌డౌన్ కొనసాగనుంది. లాక్‌డౌన్ కాలంలో సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు వంటి అత్యసర సేవలు మినహా ఉదయం 6 గంటలకు వరకు పూర్తిస్థాయి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా దేశంలోని అన్ని పాఠశాలలు, కిండర్ గార్టెన్‌లు రెండు రోజుల ముందుగానే సెప్టెంబర్ 16న మూసివేస్తారు. అయితే యూదుల నూతన సంవత్సరం ముఖ్యమైన సెలవుల ప్రారంభానికి కొన్ని గంటల ముందు ప్రధానంగా ప్రాయశ్చిత్త దినం, సుక్కోట్ ముందు వెలువడిన ఈ నిర్ణయంపై తీవ్ర నిరసర వ్యక్తమవుతోంది. తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గృహశాఖా మంత్రి యాకోవ్ లిట్జ్మాన్ రాజీనామా చేశారు, ఇది ఇజ్రాయెల్ యూదులకు అగౌరవమని ఆయన అన్నారు.
మార్చిలో కఠినమైన లాక్‌డౌన్ అమలుద్వారా కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టినందుకు ఇజ్రాయెల్ సర్కార్ మొదట్లో ప్రశంసలు అందుకుంది. కానీ ఆ తరువాత కేసులు బాగా పెరగడంతో మహమ్మారిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు చెలరేగాయి. నెతన్యాహు రాజీనామా చేయాలని వందలాది మంది ప్రదర్శనకారులు ర్యాలీలు చేశారు. ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 153,759 కరోనా కేసులు నమోదు కాగా 1,108 మంది వ్యాధి బారిన పడి మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment