వీధుల్లో దొరికే పెద్ద సైజు అరటి పండు ఒకటి మహా అంటే ఐదారు రూపాయలు ఉంటుందేమో. అందులోనూ ఇంట్లో పిల్లాడు ఆడుకుంటూ ఒక అరటి పండును గోడకు ఒక గట్టి టేప్‌తో అతికించాక దాని విలువ ఎంత అంటే.. అనవసరంగా పండును పాడుచేశావని పిల్లాడిని అంతెత్తున కోప్పడతాం. అయితే అచ్చం అలాంటి అరటి పండునే, అలాగే ఒక ఫ్రేమ్‌కు గట్టి టేప్‌తో అతికిస్తే ఒక ఔత్సాహిక కళా ప్రేమికుడు ఏకంగా రూ.52 కోట్లు పెట్టి కొన్నారంటే నమ్మగలరా?. కానీ ఇది వంద శాతం వాస్తవం. అచ్చంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బుధవారం జరిగిన వేలంపాటలో ఇది 6.2 మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడుపోయింది.
చిత్రమైన కళాఖండాలు సృష్టించే ఇటలీ కళాకారుడు మారిజో కాటెలాన్ మనోఫలకం నుంచి జాలువారి ఫ్రేమ్‌కు అతుక్కున్న కళాఖండమిది అని అక్కడి కళాపోషకులు ఆయనను పొగడ్తల్లో ముంచెత్తడం విశేషం. పాశ్చాత్య కళాకారుల్లో చిలిపివాడిగా మారిజోకు పేరుంది. బుధవారం ప్రఖ్యాత ‘సోత్‌వే’ వేలం సంస్థ నిర్వహించిన వేలంపాటలో మరో ఆరుగురు బిడ్డర్లను వెనక్కినెట్టి మరీ చైనాకు చెందిన క్రిప్టోకరెన్సీ యువ వ్యాపారవేత్త జస్టిన్ సన్ ఈ కళాఖండాన్ని ఇన్ని డబ్బులు పోసిమరీ సొంతంచేసుకున్నారు. ‘‘ ఇలాంటి అపూర్వ కళాఖండాలంటే నాకెంతో ఇష్టం. ఈ అరటి పండును చూస్తుంటే తినాలనిపిస్తుంది.
త్వరలో దీనిని అమాంతం ఆరగిస్తా’ అని జస్టిన్ సన్ సరదాగా వ్యాఖ్యానించారు. అమెరికాలో అత్యున్నత శ్రేణి పండ్ల దుకాణంలో దాదాపు రూ.30 ఉండే ఈ ఒక్క అరటి పండు ఇంతటి ధర పలకడం ప్రపంచవ్యాప్తంగా కళాఖండాలను కొనే వ్యాపారులనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఊహించిన ధర కంటే నాలుగు రెట్లు అధిక ధరకు అమ్ముడుపోయిందని సోత్‌బే సంస్థ పేర్కొంది. వేలంపాటల చరిత్రలో ఒక ఫలం ఇంతటి ధర పలకడం ఇదే తొలిసారి అని వేలంపాట వర్గాలు వెల్లడించాయి. 2019లో మియామీ బీచ్‌లోని ఆర్ట్ బాసెల్ షోలో తొలిసారిగా ‘కమేడియన్’ పేరిట ఈ పండును ప్రదర్శించారు.
దానిని చూసినవారంతా ‘అసలు ఇదేం ఆర్ట్?. దీనిని కూడా ఆర్డ్ అంటారా?’ అంటూ పలువురు విమర్శించారు. అయితే ఐదేళ్ల క్రితమే ఇది 1,20,000 డాలర్ల ధర పలికి ఔరా అనిపించింది. గతంలో వచ్చిన విమర్శలపై తాజాగా జస్టిన్ సన్ స్పందించారు. ‘‘ ఈ ఘటనను కేవలం కళగానే చూడకూడదు. ఇదొక సాంస్కృతిక ధోరణుల్లో మార్పుకు సంకేతం. కళలు, మీమ్స్, క్రిప్టో కరెన్సీ వర్గాల మధ్య వారధిగా దీనిని చూడొచ్చు. పండు ఇంతటి ధర పలకడం ఏంటబ్బా ? అని మనుషుల ఆలోచనలకు, చర్చలకు ఇది వేదికగా నిలుస్తుంది. చరిత్రలోనూ స్థానం సంపాదించుకుంటుంది’ అని జస్టిన్ వ్యాఖ్యానించారు.
మారుతున్న పండు !
వాస్తవానికి 2019లో ప్రదర్శించిన పండు ఇది కాదు. 2019లో దీనిని ప్రదర్శించినపుడు అది పాడయ్యేలోపే అక్కడి కళాకారుడు డేవిడ్ డట్యూనా తినేశాడు. ఆకలికి ఆగలేక గుటకాయ స్వాహా చేశానని చెప్పాడు. ‘‘ప్రపంచంలో క్షుద్బాధతో ఎంతో మంది అల్లాడుతుంటే పోషకాల పండును ఇలా గోడకు అతికిస్తారా?. అయినా 20 సెంట్లు విలువచేసే పండు నుంచి కోట్లు కొల్లకొ డుతున్న ఈ కళాకారుడు నిజంగా మేధావి’’ అని డేవిడ్ వ్యాఖ్యానించాడు. 1,20,000 డాలర్లకు అమ్ముడుపోయాక దీనిని ఆయన తిన్నారు. తర్వాత మరో పండును ప్రదర్శనకు పెట్టారు.
దానిని గత ఏడాది దక్షిణకొరియాలోని సియోల్ సిటీలోని ‘లీయిమ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’లో ప్రదర్శనకు ఉంచినపుడు నోహ్ హుయాన్ సో అనే విద్యార్థి తినేశాడు. ఇప్పుడు వేలంపాటలో అమ్ముడుపోయింది కొత్త పండు. అత్యంత గట్టిగా అతుక్కునే ‘డక్ట్’ టేప్‌తో ఫ్రేమ్‌కు ఈ పండును అతికించారు. ఈ కళాఖండాన్ని సృష్టించిన మారి జో కాటెలాన్ గతంలో ఇలాంటి వింత కళారూ పాలను తయారుచేశారు. 18 క్యారెట్ల పుత్తడితో నిజమైన టాయిలెట్‌ను రూపొందించారు. దానికి ‘అమెరికా’ అని పేరు పెట్టారు. దీనిని ప్రదర్శనకు పెట్టుకుంటే అప్పుగా ఇస్తానని కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఈయన గతంలో ఒక ఆఫర్ కూడా ఇచ్చాడట.
కొన్న వ్యక్తిపై గతంలో ఆరోపణలు
పండును కొనుగోలుచేసిన జస్టిన్ సన్ ప్రస్తుతం చైనాలో ట్రోన్ పేరిట బ్లాక్‌చైన్ నెట్‌వర్క్ వ్యాపారం చేస్తున్నారు. కొన్ని క్రిప్టోకరెన్సీల లావాదేవీలను పర్యవేక్షిస్తు న్నారు. ట్రోన్ క్రిప్టో టోకెన్ అయిన టీఆర్‌ఎస్ విలువను కృత్రిమంగా అమాంతం పెంచేసి మోసానికి పాల్పడుతున్నాడని జస్టిన్‌పై అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ కమిషన్ కేసు కూడా వేసింది. అయితే ఆ ఆరోపణలను జస్టిన్ తోసిపు చ్చారు. 2021–23లో ఈయన ప్రపంచ వాణిజ్య సంస్థలో గ్రెనడే దేశ శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment