పేరుమార్చుకున్న ఫేస్‌బుక్‌.. ఇకపై అన్ని సేవలు ‘మెటా’ కిందనే | Facebook is changing its name to Meta | Sakshi
Sakshi News home page

Facebook: పేరుమార్చుకున్న ఫేస్‌బుక్‌.. ఇకపై అన్ని సేవలు ‘మెటా’ కిందనే

Published Fri, Oct 29 2021 5:36 AM | Last Updated on Fri, Oct 29 2021 8:05 AM

Facebook is changing its name to Meta - Sakshi

ఓక్లాండ్‌: సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌ ‘కార్పొరేట్‌’ పేరు ఇకపై ‘మెటా’గా రూపాంతరం చెందనుంది. ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ గురువారం కంపెనీ కనెక్ట్‌ ఈవెంట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ మేరకు కొత్తలోగో ఆవిష్కరణ జరిగింది. అంతర్జాతీయంగా ఇటీవల ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌ సేవలు సాంకేతికంగా పలు గంటల పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

ప్రజాభద్రతకంటే లాభార్జనకే ఫేస్‌బుక్‌ పెద్దపీట వేస్తోందని ఇటీవల తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇంతకుముందు ఫేస్‌బుక్‌ కింద కొనసాగిన సామాజిక మాధ్యమాలు– ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లు ఇకపై ‘మెటా’ కింద కొనసాగుతాయి. అంటే మాతృసంస్థ పేరుమాత్రమే మారింది తప్ప, దానికింద ఉండే సామాజిక మాధ్యమాల సేవలు పాతపేర్లతోనే కొనసాగుతాయి.   
 
‘మెటావర్స్‌’ దిశలో అడుగులు!
‘మెటావర్స్‌’లో భాగంగా పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు జుకర్‌బర్గ్‌ తెలిపారు. వర్చువల్‌–రియాలిటీ స్పేస్‌లో రానున్న కాలంలో వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేని అత్యున్నత స్థాయి సాంకేతిక సేవలను వినియోగం, తత్సబంధ అంశాలు ‘మెటావర్స్‌’ పరిధిలోకి వస్తాయి. ‘యాప్స్‌’ నుంచి మరింత సాంకేతిక పరిపక్వత కలిగిన ‘మెటావర్స్‌’దిశగా మెటా అడుగులు వేస్తుందని కూడా ఈ సందర్భంగా జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు.

‘‘ఒకరికి ఒకరిని కలిపి ఉంచడానికి సాంకేతికతను ఆవిష్కరించే కంపెనీ మనది. వెరసి మన సాంకేతికతలో ప్రజలను ఒక చోటు కేంద్రీకరించవచ్చు. తద్వారా అందరూ కలిసి ఆర్థిక వ్యవస్థ మరింత పురోగతికి దోహదపడవచ్చు’’ అని ఈ సందర్భంగా జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు. ‘‘ప్రస్తుత బ్రాండ్‌ ఇకపై మనకు కావాల్సిన సేవల అన్నింటినీ అందించలేకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో మనం భవిష్యత్తుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ దిశలోనే మన సంస్థ బ్రాడ్‌ పేరు మారింది’’ అని కూడా ఆయన పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement