న్యూయార్క్: కరోనా వైరస్ మహమ్మారి మూలాలపై ఎడతెగని చర్చ కొనసాగుతున్న క్రమంలో అమెరికాకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు మరో కీలక విషయాన్ని ప్రకటించారు. కోవిడ్-19 మూలాలు పూర్తిగా అర్థం చేసుకోకపోతే కోవిడ్-26, కోవిడ్-32 కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. మహమ్మారి ఎలా ప్రారంభమైందో తెలియకపోవడం వల్ల భవిష్యత్తులలో వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ సెంటర్ ఫర్ వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ కోడైరెక్టర్ పీటర్ హోటెజ్ తెలిపారు. కోవిడ్-19 ఆనవాళ్లు కనుక్కోలేకపోతే విలయాలు తప్పవని అమెరికా శాస్త్రవేత్త , అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాలంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) కమిషనర్‌గా ఉన్న స్కాట్ గాట్లిబ్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మరిన్ని విలయాలను నివారించేందుకు చైనా ప్రభుత్వ సహకారం అవసరమని ఆయ పేర్కొన్నారు.
సార్స్ సీవోవీ2 వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే లీకైనట్లు ఆధారాలు బలపడుతున్నాయని, ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలకు చైనా సహకారం కావాలని, భవిష్యత్తు మహమ్మారులను అడ్డుకోవాలంటే ఈ చర్యలు తప్పవని స్కాట్ తెలిపారు. చైనాలో సుదీర్ఘ కాలం విచారణ చేపట్టేందుకు శాస్త్రవేత్తలను అనుమతించాలన్నారు. అలాగే అక్కడి మనుషులు, జంతువుల నుంచి రక్త నమూనాలు సేకరించేందుకు శాస్త్రవేత్తలను అనుమతించాలని హోటెజ్ తెలిపారు. సైంటిస్టులు, ఎపిడమాలజిస్ట్‌లు, వైరాలజిస్టులు, బ్యాట్ ఎకాలజిస్ట్ పరిశోధకులు హుబే ప్రావిన్సులో సుమారు ఆరు నెలలు ఉండాలని హోటెజ్ పేర్కొన్నారు. అంతేకాదు ఆంక్షలు, బెదిరింపులతో సహా, చైనాపై అమెరికా ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.
కరోనా మహమ్మారి మూలాలు చైనాలోనే ఉన్నాయనే, నిజాలు చెప్పకుండా ప్రపంచాన్ని మోసం చేసిందని ట్రంప్ మొదటినుంచి చైనాపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. అయితే వుహాన్‌లో చేపల మార్కెట్లో తొలుత వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. జంతువుల నుంచి మనుషులకు ఆ వైరస్ సోకి ఉండి ఉంటుందని చాలామంది వైరాలజిస్టులు అంచనా వేశారు. దీనిపై బిన్న వాదనల మధ్య కొనసాగుతున్న ఈ చర్చ దాదాపు ఏడాదిన్నర తరువాత మే 23న వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికతో మరింత రాజుకుంది. వుహాన్‌లో పనిచేసే ముగ్గురు పరిశోధకులకు 2019 నవంబర్ కన్నా ముందే వైరస్ సోకినట్లు పేర్కొనడంతో కరోనా ఆనవాళ్లపై అంతర్జాతీయంగా చర్చ తిరిగి మొదలైంది. మరోవైపు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుండే లీక్ అయ్యిందా అనే దానిపై తమ నిఘా విభాగం కీలక అంచనాలు తమ వద్ద ఉన్నాయనీ, దీనిపై లోతైన దర్యాప్తు చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఆదేశించారు. దీనిపై 90 రోజుల్లో తనకు నివేదించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
చదవండి : వ్యాక్సిన్: మందుబాబులకు పరేషాన్!
కరోనా కల్లోలం: గూడు చెదిరిన గువ్వలు
Comments
Please login to add a commentAdd a comment