వాషింగ్టన్: గగనతలంలో శత్రుదేశంపై పైచేయి సాధించేందుకు మెరుపువేగంతో దూసుకెళ్లి దాడి చేసే యుద్ధవిమానాలు అవసరం. ఆ విమానాలకు అపార శక్తిని సరఫరాచేసే జెట్ ఇంజన్లే గుండెకాయ. అలాంటి అత్యంత అధునాతన ఎఫ్414 జెట్ ఇంజన్లను భారత్‌లోనే తొలిసారిగా తయారుచేసేందుకు మార్గం సుగమమైంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇది సాధ్యమైంది.
భారత్‌లోనే ఫైటర్‌జెట్ ఇంజన్లను తయారుచేసేందుకు సంబంధించిన చరిత్రాత్మక అవగాహన ఒప్పందం జనరల్ ఎలక్ట్రిక్(జీఈ) ఏరోస్పేస్, హిందుస్తాన్ ఎరోనాటిక్స్ (హాల్) మధ్య అమెరికాలో కుదిరింది. ‘భారత వాయుసేనకు చెందిన అధునాతన తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌లో శక్తివంత ఎఫ్414 ఇంజన్లను బిగిస్తారు. ఈ ఇంజన్లను భారత్‌లోనే తయారుచేస్తామని జీఈ ప్రకటించింది.
ఒప్పందాలు
ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారత్–అమెరికా మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. అవి..
1. ఇరుదేశాల నడుమ కుదిరిన మారీటైమ్ ఒప్పందం ప్రకారం.. ఆసియా ప్రాంతంలో సంచరించే అమెరికా నావికాదళం నౌకలు ఒకవేళ మరమ్మతులకు గురైతే భారత్‌లోని షిప్‌యార్డుల్లో ఆగవచ్చు. మరమ్మతులు చేసుకోవచ్చు.
2. సముద్రాలపై నిఘా కోసం ఆర్మ్‌డ్ ఎంక్యూ–9బీ సీ గార్డియన్ డ్రోన్లను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. దీనిపై ఒప్పందం కుదిరింది.
3. అమెరికాకు చెందిన చిప్ తయారీ కంపెనీ ‘మైక్రాన్’ గుజరాత్‌లో సెమీ కండక్టర్ల తయారీ, పరీక్షల ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 800 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది.
ఈ ఇంజన్ అసమానం
‘ఎఫ్414 ఇంజన్ పనితీరుతో ఏదీ సాటిరాదు. మా కస్టమర్ దేశాల సైనిక అవసరాలు తీర్చడంలో, అత్యుత్తమ ఇంజన్లను అందించేందుకు సదా సిద్దం. ఇరుదేశాల ధృడ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న మోదీ, బైడెన్ దార్శనికతలో మేం కూడా భాగస్వాములు కావడం గర్వంగా ఉంది’ అని లారెన్స్ జూనియర్ అన్నారు. తొలి దఫాలో 99 ఇంజన్లను తయారుచేస్తారు. ఇన్నాళ్లూ రష్యా, ఐరోపా దేశాల నుంచే యుద్ధవిమానాలను కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న భారత్ ఇప్పుడు అమెరికా దిగ్గజ సంస్థతో తయారీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో భారత ఆయుధ పరిశ్రమలో నూతన శకం ఆరంభం కానుంది.
ఎఫ్414–ఐఎన్‌ఎస్6 ఇంజన్ల ఉమ్మడి తయారీ భాగస్వామ్యంతోపాటు అడ్వాన్స్‌డ్ మీడియా కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఏఎంసీఏ)ఎంకే2 ఇంజన్ ప్రోగ్రామ్ కోసం భారత్‌తో జీఈ కలిసి పనిచేయనుంది. ప్రస్తుతం భారత వాయుసేన తేలికపాటి 88 యుద్ధ విమానాల కోసం హాల్.. జీఈ 404 ఇంజన్లనే దిగుమతి చేసుకుని వాటికి బిగిస్తోంది. ఇకపై శక్తివంత ఎఫ్414 ఇంజన్ల సామర్థ్యంతో గగనతలంలో భారత వాయుసేన సత్తా మరింత ఇనుమడించనుంది. ఇటీవల ఫ్రాన్స్‌కు చెందిన యుద్దవిమానాల తయారీ సంస్థ దసాల్ట్ నుంచి 36 రఫేల్ యుద్దవిమానాలను భారత్ కొనుగోలుచేయడం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment