Hindustan Aeronautics
-
దేశ ఆయుధ పరిశ్రమలో నవశకం !
వాషింగ్టన్: గగనతలంలో శత్రుదేశంపై పైచేయి సాధించేందుకు మెరుపువేగంతో దూసుకెళ్లి దాడి చేసే యుద్ధవిమానాలు అవసరం. ఆ విమానాలకు అపార శక్తిని సరఫరాచేసే జెట్ ఇంజన్లే గుండెకాయ. అలాంటి అత్యంత అధునాతన ఎఫ్414 జెట్ ఇంజన్లను భారత్‌లోనే తొలిసారిగా తయారుచేసేందుకు మార్గం సుగమమైంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇది సాధ్యమైంది. భారత్‌లోనే ఫైటర్‌జెట్ ఇంజన్లను తయారుచేసేందుకు సంబంధించిన చరిత్రాత్మక అవగాహన ఒప్పందం జనరల్ ఎలక్ట్రిక్(జీఈ) ఏరోస్పేస్, హిందుస్తాన్ ఎరోనాటిక్స్ (హాల్) మధ్య అమెరికాలో కుదిరింది. ‘భారత వాయుసేనకు చెందిన అధునాతన తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌లో శక్తివంత ఎఫ్414 ఇంజన్లను బిగిస్తారు. ఈ ఇంజన్లను భారత్‌లోనే తయారుచేస్తామని జీఈ ప్రకటించింది. ఒప్పందాలు ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారత్–అమెరికా మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. అవి.. 1. ఇరుదేశాల నడుమ కుదిరిన మారీటైమ్ ఒప్పందం ప్రకారం.. ఆసియా ప్రాంతంలో సంచరించే అమెరికా నావికాదళం నౌకలు ఒకవేళ మరమ్మతులకు గురైతే భారత్‌లోని షిప్‌యార్డుల్లో ఆగవచ్చు. మరమ్మతులు చేసుకోవచ్చు. 2. సముద్రాలపై నిఘా కోసం ఆర్మ్డ్ ఎంక్యూ–9బీ సీ గార్డియన్ డ్రోన్లను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. దీనిపై ఒప్పందం కుదిరింది. 3. అమెరికాకు చెందిన చిప్ తయారీ కంపెనీ ‘మైక్రాన్’ గుజరాత్లో సెమీ కండక్టర్ల తయారీ, పరీక్షల ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 800 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ఇంజన్ అసమానం ‘ఎఫ్414 ఇంజన్ పనితీరుతో ఏదీ సాటిరాదు. మా కస్టమర్ దేశాల సైనిక అవసరాలు తీర్చడంలో, అత్యుత్తమ ఇంజన్లను అందించేందుకు సదా సిద్దం. ఇరుదేశాల ధృడ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న మోదీ, బైడెన్ దార్శనికతలో మేం కూడా భాగస్వాములు కావడం గర్వంగా ఉంది’ అని లారెన్స్ జూనియర్ అన్నారు. తొలి దఫాలో 99 ఇంజన్లను తయారుచేస్తారు. ఇన్నాళ్లూ రష్యా, ఐరోపా దేశాల నుంచే యుద్ధవిమానాలను కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న భారత్ ఇప్పుడు అమెరికా దిగ్గజ సంస్థతో తయారీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో భారత ఆయుధ పరిశ్రమలో నూతన శకం ఆరంభం కానుంది. ఎఫ్414–ఐఎన్ఎస్6 ఇంజన్ల ఉమ్మడి తయారీ భాగస్వామ్యంతోపాటు అడ్వాన్స్డ్ మీడియా కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఏఎంసీఏ)ఎంకే2 ఇంజన్ ప్రోగ్రామ్ కోసం భారత్‌తో జీఈ కలిసి పనిచేయనుంది. ప్రస్తుతం భారత వాయుసేన తేలికపాటి 88 యుద్ధ విమానాల కోసం హాల్.. జీఈ 404 ఇంజన్లనే దిగుమతి చేసుకుని వాటికి బిగిస్తోంది. ఇకపై శక్తివంత ఎఫ్414 ఇంజన్ల సామర్థ్యంతో గగనతలంలో భారత వాయుసేన సత్తా మరింత ఇనుమడించనుంది. ఇటీవల ఫ్రాన్స్‌కు చెందిన యుద్దవిమానాల తయారీ సంస్థ దసాల్ట్ నుంచి 36 రఫేల్ యుద్దవిమానాలను భారత్ కొనుగోలుచేయడం తెల్సిందే. -
బీఈఎల్‌తో హెచ్ఏఎల్ రూ. 2,400 కోట్ల ఒప్పందం
బెంగళూరు: ప్రభుత్వ రంగ దిగ్గజం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ నుంచి రూ. 2,400 కోట్ల కాంట్రాక్టును భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్) దక్కించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తేలికపాటి యుద్ధ విమానాలు (ఎల్సీఏ) తేజాస్ ఎంకే1ఏలకు అవసరమైన 20 రకాల ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్‌ను (ఎల్‌ఆర్‌యూ మొదలైనవి) బీఈఎల్ తయారీ చేసి, సరఫరా చేయాల్సి ఉంటుంది. 2023 నుంచి 2028 వరకూ అయిదేళ్ల వరకూ ఈ కాంట్రాక్టు కాలపరిమితి ఉంటుంది. మరోవైపు, 83 తేజాస్ ఎంకే1ఏలను భారత వైమానిక దశానికి 2023–24 నుంచి అందించడం మొదలవుతుందని హెచ్ఏఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. -
భారీగా పెరిగిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లాభం
ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో భారీగా పెరిగింది. గత క్యూ2లో రూ.68 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 325 శాతం వృద్ధితో రూ.289 కోట్లకు పెరిగిందని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ తెలిపింది. ఆదాయం రూ.2,373 కోట్ల నుంచి 10 శాతం పెరిగి రూ.2,610 కోట్లకు పెరిగిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.125 కోట్లుగా ఉన్న ఎబిటా ఈ క్యూ2లో రూ.523 కోట్లకు ఎగసిందని వివరించింది. నిర్వహణ మార్జిన్ 5.3 శాతం నుంచి నాలుగు రెట్లు పెరిగి 20 శాతానికి చేరిందని పేర్కొంది. ముడి పదార్ధాల ధరలు రూ.929 కోట్ల నుంచి 28 శాతం తగ్గి రూ.668 కోట్లకు తగ్గాయని తెలిపింది. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో ఈ షేర్ కూడా భారీగా పెరిగింది. బుధవారం రూ.790 వద్ద ముగిసిన ఈ షేర్ శుక్రవారం రూ.785–944 కనిష్ట, గరిష్ట స్థాయిల వద్ద కదలాడింది. చివరకు 16 శాతం లాభంతో రూ.919 వద్ద ముగిసింది. -
ఆకట్టుకోని హెచ్ఏఎల్ లిస్టింగ్
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం, రక్షణ రంగ పరికరాల తయారీ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్) నిరాశాకరమైన లిస్టింగ్‌ను నమోదు చేసింది. బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ అండతో ఇటీవలే పబ్లిక్ ఇష్యూ పూర్తిచేసుకున్న హెచ్ఏఎల్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో పేలవమైన ప్రదర్శన కనబర్చింది. ఇష్యూ ధర రూ. 1240 కాగా.. బీఎస్ఈలో రూ. 1169 వద్ద లిస్టయ్యింది. ఇది దాదాపు 5 శాతం నష్టాలతో కొనసాగుతోంది. ఒకదశలో1150 స్థాయికి పడిపోయింది.డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారీలో దేశంలోనే అతిపెద్ద సంస్థ హెచ్ఏఎల్ చేపట్టిన పబ్లిక్ ఇష్యూకి 98 శాతం స్పందన లభించగా.. ఇష్యూ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 4229 కోట్లను సమీకరించాలని భావించగా.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) వేసిన బిడ్ విలువే రూ. 3000 కోట్లు. ప్రభుత్వం 10 శాతం వాటాను విక్రయించేందుకు వీలుగా హెచ్ఏఎల్ ఐపీవోను చేపట్టింది. రూ. 1215-1240 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 4000 కోట్లు సమీకరించాలని భావించింది. సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం(క్విబ్) 1.73 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌కాగా.. దీనిలో ఎల్‌ఐసీకాకుండా మ్యూచువల్ ఫండ్స్ రూ. 130 కోట్ల విలువైన బిడ్స్ దాఖలు చేసినట్లు తెలుస్తొంది. సంపన్న వర్గాల(హెచ్ఎన్ఐ) విభాగంలో 3.5 శాతం స్పందన మాత్రమే లభించింది. ఇక రిటైల్ విభాగం సైతం 36 శాతమే సబ్స్క్రయిబ్ అయ్యింది. రిటైలర్లకు ప్రభుత్వం షేరుకి రూ. 25 డిస్కౌంట్ ప్రకటించినప్పటికీ ఆశించిన స్పందన రాకపోవడం గమనార్హం. -
నాలుగు ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: హిందుస్తాన్ ఏరోనాటిక్స్తోపాటు మరో మూడు సంస్థల ఐపీవోలకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఫ్యూచర్ సప్లయ్ చైన్ సొల్యుషన్స్, గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఇండియా లిమిటెడ్, ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ ఆమోదం పొందిన వాటిలో ఉన్నాయి. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఐపీవోలో కేంద్ర ప్రభుత్వం 10 శాతం వాటాకు సమానమైన 3.61 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఫ్యూచర్ సప్లయ్ చైన్ సొల్యుషన్స్ ఐపీవోలో 78,27,656 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా గ్రిఫిన్ పార్ట్నర్స్ విక్రయించనుండగా, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ 19,56,914 షేర్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఐపీవోలో రూ.700 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉందని మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ఫ్యూచర్ సప్లయ్ చైన్ సొల్యుషన్స్ కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందినది. ఇక గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఐపీవోలో భాగంగా రూ.195 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయనుంది. అలాగే, కంపెనీలో ప్రస్తుత వాటాదారులు సైతం 6 లక్షల షేర్లను ఆఫర్ చేయనున్నారు. -
ఉద్యోగాలు
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: సీనియర్ మెడికల్ ఆఫీసర్(రేడియాలజీ/ మెడిసిన్/ ఇండస్ట్రియల్ హెల్త్/అనెస్తీషియా/ ఓబీ అండ్ జీ) మెడికల్ ఆఫీసర్(జనరల్ డ్యూటీ) ఫైర్ ఆఫీసర్ ఇంజనీర్(సివిల్) అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ దరఖాస్తులకు చివరి తేది: జూలై 18 వెబ్సైట్: www.hal-india.com ముంబై పోర్ట్ ట్రస్ట్ ముంబై పోర్ట్ ట్రస్ట్ గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటీస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ట్రేడ్: గ్రాడ్యుయేట్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, మెకానిక్(డీజిల్), పైప్ ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, మెకానిక్(మోటార్ వెహికల్),డ్రాఫ్ట్స్‌మెన్(మెకానికల్), ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్. దరఖాస్తులకు చివరి తేది: జూలై 18 వెబ్సైట్: www.mumbaiport.gov.in ప్రవేశాలు నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్ నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్, న్యూ ఢిల్లీ కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంఏ(హిస్టరీ ఆఫ్ ఆర్ట్) అర్హతలు: 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. సోషల్ సైన్స్, లిబరల్ ఆర్ట్స్ లేదా ఫైన్స్ ఆర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి. ఎంఏ(కన్జర్వేషన్) అర్హతలు: 50 శాతం మార్కులతో కెమిస్ట్రీ/ఫిజిక్స్/జియాలజీ/బోటనీ/జువాలజీ/కంప్యూటర్ సైన్స్/ఫైన్ ఆర్ట్స్/హిస్టరీ ఆఫ్ ఆర్ట్/ఆర్కిటెక్చర్/ఆర్కియాలజీ/మ్యూజియాలజీ లలో డిగ్రీ. ఎంఏ(మ్యూజియాలజీ) అర్హతలు: 50 శాతం మార్కులతో బీఏ/బీఎస్సీ(హానర్స్) లేదా బీఏ/బీఎస్సీ/బీఎఫ్ఏ (మూడేళ్లు) ఉత్తీర్ణులైనవారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 3 వెబ్సైట్: www.nmi.gov.in ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రెజైస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రెజైస్, హైదరాబాద్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: రిటైల్ అండ్ మార్కెటింగ్, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ బిజినెస్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అర్హతలు: 50% మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు క్యాట్/గ్జాట్/మ్యాట్/సీమ్యాట్/ ఏటీఎంఏ స్కోరు ఉండాలి. వెబ్సైట్: www.ipeindia.com