సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం, రక్షణ రంగ పరికరాల తయారీ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్‌ఏఎల్) నిరాశాకరమైన లిస్టింగ్‌ను నమోదు చేసింది. బీమా రంగ దిగ్గజం ఎల్‌ఐసీ అండతో ఇటీవలే పబ్లిక్ ఇష్యూ పూర్తిచేసుకున్న హెచ్‌ఏఎల్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో పేలవమైన ప్రదర్శన కనబర్చింది. ఇష్యూ ధర రూ. 1240 కాగా.. బీఎస్‌ఈలో రూ. 1169 వద్ద లిస్టయ్యింది. ఇది దాదాపు 5 శాతం నష్టాలతో కొనసాగుతోంది. ఒకదశలో1150 స్థాయికి పడిపోయింది.డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ తయారీలో దేశంలోనే అతిపెద్ద సంస్థ హెచ్‌ఏఎల్ చేపట్టిన పబ్లిక్ ఇష్యూకి 98 శాతం స్పందన లభించగా.. ఇష్యూ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 4229 కోట్లను సమీకరించాలని భావించగా.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) వేసిన బిడ్ విలువే రూ. 3000 కోట్లు.
ప్రభుత్వం 10 శాతం వాటాను విక్రయించేందుకు వీలుగా హెచ్‌ఏఎల్ ఐపీవోను చేపట్టింది. రూ. 1215-1240 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 4000 కోట్లు సమీకరించాలని భావించింది. సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం(క్విబ్) 1.73 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌కాగా.. దీనిలో ఎల్‌ఐసీకాకుండా మ్యూచువల్ ఫండ్స్ రూ. 130 కోట్ల విలువైన బిడ్స్ దాఖలు చేసినట్లు తెలుస్తొంది. సంపన్న వర్గాల(హెచ్‌ఎన్‌ఐ) విభాగంలో 3.5 శాతం స్పందన మాత్రమే లభించింది. ఇక రిటైల్ విభాగం సైతం 36 శాతమే సబ్‌స్క్రయిబ్ అయ్యింది. రిటైలర్లకు ప్రభుత్వం షేరుకి రూ. 25 డిస్కౌంట్ ప్రకటించినప్పటికీ ఆశించిన స్పందన రాకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment