మూడు కంపెనీల బంపర్ లిస్టింగ్
గతవారం పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకున్న విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, మొబిక్విక్ కంపెనీల షేర్లు బుధవారం స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యాయి. ఈ మూడు కంపెనీల షేర్లు భారీ ప్రీమియం ధరతో లిస్టయ్యాయి. ఈక్విటీ మార్కెట్ నష్టాల్లో ట్రేడవుతున్నా.., వీటికి కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో తొలిరోజే మొబిక్విక్ షేరు అత్యధికంగా 90%, విశాల్ మెగామార్ట్ 44%, సాయి లైఫ్ సైన్సెస్ 42 శాతం లాభాలను ఇన్వెస్టర్లకు పంచాయి.
విశాల్ మెగామార్ట్
దేశవ్యాప్తంగా సూపర్‌మార్ట్‌లను నిర్వహిస్తున్న విశాల్ మెగామార్ట్ షేరు ఎన్‌ఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ.78)తో పోలిస్తే 33% ప్రీమియంతో రూ.104 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 46% ఎగసి రూ.114 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 44% లాభంతో రూ.112 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.50,444 కోట్లుగా నమోదైంది.
మొబిక్విక్ సిస్టమ్స్
మొబిక్విక్ పేరుతో ఫిన్‌టెక్ సేవలు అందించే వన్ మొబిక్విక్ సిస్టమ్స్ షేరు బీఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ.279)తో పోలిస్తే 59% ప్రీమియంతో రూ.442 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో ఏకంగా 90.21% ఎగసి రూ.531 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి అదే స్థాయి (రూ.530) వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.4,120 కోట్లుగా నమోదైంది.
సాయి లైఫ్ సైన్సెస్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాయి లైఫ్ సైన్సెస్ షేరు ఎన్‌ఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ.549)తో పోలిస్తే 18% ప్రీమియంతో రూ.650 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 42% ఎగసి రూ.780 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 40% లాభంతో రూ.768 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,974 కోట్లుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment